Revant Reddy : ఓఆర్ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీఐని సంప్రదించినా వారు స్పందించట్లేదని ఆయన ఆరోపించారు. ఓఆర్ఆర్లీజు టెండర్లలో అక్రమాలు జరిగాయని వాటి వివరాల కోసం ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకపోవడం.. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టీఐకి కమిషనర్లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ని సీఎం కేసీఆర్ కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుంటుందని రేవంత్గతంలో ఆరోపించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లీజ్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఓఆర్ఆర్ లీజులో భారీ స్కామ్ జరిగిందని, ఈ కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ఓఆర్ఆర్ లీజ్ స్కాములో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్రధారులు అంటున్నారు. ఓఆర్ఆర్ లీజ్ స్కామ్ లో విచారణ సంస్థకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులకు కీలకంగా మారిన ఓఆర్ఆర్ కు ప్రతి సంవత్సరం రూ. 700 నుండి రూ.800 కోట్ల వరకు టోల్ రూపంలోనే వస్తాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలన్నీ తప్పని ఇప్పటికే హెచ్ఎండీఏ ఆయనపై పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేసింది. అవి కూడా కోర్టులో ఉన్నాయి.
ఈ టెండర్ దక్కించుకునేందుకు నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేయగా.. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఐఆర్బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఖరారు అయింది. ఈ మొత్తం ఒకేసారి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. లీజు కుదరడంతో ఇక నుండి నిర్వహణ నుండి టోల్ వసూలు వరకు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్లనున్నాయి. గత సంవత్సర కాలంగా దీనిపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. మార్చి నెలాఖరుకు టెండర్ గడువు ముగిసిన తర్వాత మొత్తం 4 కంపెనీలు తమ బిడ్లను దాఖలు చేశాయి.
బిడ్లు దాఖలు చేసిన కంపెనీలకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాల పరిశీలన పూర్తి కాగా.. ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారులు అధ్యయనం చేశారు. అన్ని అర్హతలు గుర్తించిన అనంతరం ఎక్కువగా కోట్ చేసిన సంస్థకు ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో లీజుగు అప్పగించారు. ఇందులో భాగంగా ముంబయికి చెందిన ఐఆర్బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కి బిడ్ దక్కింది. ఓఆర్ఆర్ ను మొత్తం 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. ఓఆర్ఆర్ పై ఎక్కి, దిగడానికి 44 పాయింట్లు ఉన్నాయి. అలాగే 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు ఉన్నాయి. టోల్ వసూళ్ల కింద ఏటా రూ.400 నుండి రూ.450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. దీనిని ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.