Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.  ‘కేర్ టేకర్’గా వచ్చి యువీ కుటుంబాన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న నేరానికి గాను  సదరు మహిళను అరెస్ట్ చేసినట్టు  పోలీసులు వెల్లడించారు.  రూ. 40 లక్షలు ఇవ్వకుంటే   యువీ కుటుంబాన్ని బజారుకీడుస్తానని, తప్పుడు కేసులు  కూడా పెట్టిస్తానని  నిందితురాలు వేధింపులకు గురిచేయడంతో   రక్షక భటులు ఆమె ఆట కట్టించారు. 


అసలేం జరిగిందంటే.. 


యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. గతేడాది తన చిన్న కొడుకు జోరావార్ సింగ్ సంరక్షణ నిమిత్తమై  హేమా కౌశిక్ అనే  మహిళను అతడికి కేర్ టేకర్‌గా నియమించుకుంది. జోరావర్ చాలాకాలంగా ‘డిప్రెషన్’తో బాధపడుతున్నాడు. అతడి సంరక్షణ నిమిత్తం షబ్నమ్.. హేమను నియమించుకుంది.  అయితే పనిలో చేరిన 20 రోజుల తర్వాతే ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో  యువీ ఫ్యామిలీ  హేమను పని నుంచి తప్పించింది. దీంతో ఆమె యువీ కుటుంబంపై పగబట్టింది.


రూ. 40 లక్షలు ఇవ్వాలని  వేధింపులు.. 


తనను పని నుంచి తొలగించిన తర్వాత హేమా.. యువీ కుటుంబాన్ని టార్గెట్ చేసింది.  షబ్నమ్‌కు తరుచూ కాల్స్ చేస్తూ, వాట్సాప్  సందేశాల ద్వారా డబ్బులు కావాలని వేధించేది.  తనకు రూ. 40 లక్షలు కావాలని.. అవి ఇవ్వకుంటే  యువీ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తానని, తప్పుడు కేసులు పెడతానని బెదిరించేది.   దీంతో  యువీ తల్లి  గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్ - 1  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది.


 






షబ్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా   పోలీసులు హేమకు డబ్బు ఆశ చూపే  ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు.  ఆమెకు అడ్వాన్స్ కింద రూ. 5 లక్షలు ఇస్తామని నమ్మించి  ఓ ప్రదేశానికి రమ్మన్నారు. అక్కడికి వచ్చిన హేమను  అదుపులోకి తీసుకున్నారు.


 






భారత జట్టుకు  రెండు ఐసీసీ ట్రోఫీలు అందించడంలో కీలక పాత్ర పోషించిన  యువరాజ్..  క్యాన్సర్‌ను జయించి తిరిగి  జట్టులో చోటు సంపాదించాడు. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్లపాటు విదేశాలలో జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడిన  యువీ  చాలాకాలంగా  ఆటకు దూరంగా ఉన్నాడు. అతడు త్వరలోనే యూఎస్ వేదికగా జరుగబోయే యూఎస్ మాస్టర్స్ టీ10  లీగ్‌లో పాల్గొననున్నాడని  తెలుస్తున్నది. 








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial