Malaysia vs China T20I: బ్యాటర్లకు అనుకూలంగా ఉండే  టీ20లలో  ఏదో పిచ్‌లు అనుకూలిస్తే తప్ప నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడం  కష్టంతో కూడుకున్నది.   అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ బౌలర్లుగా వెలుగొందుతున్న స్టార్ బౌలర్స్ కూడా టీ20లలో ఐదు వికెట్ల  ప్రదర్శన చేయడానికే  నానా తంటాలు పడతారు.  కానీ  మలేషియాకు చెందిన పేసర్  స్యాజ్రుల్ ఇద్రుస్ అయితే  ఏకంగా   ఏడు వికెట్లు తీసి అబ్బురపరిచాడు.  వేసింది నాలుగు ఓవర్లే అయినా  8 పరుగులే ఇచ్చి  ఏడువికెట్లు తీశాడు. ఈ ఏడూ  క్లీన్ బౌల్డే కావడం మరో విశేషం. 


మలేషియాలోని  బ్యూమస్ ఓవల్ వేదికగా  ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ఆసియా రీజినల్ క్వాలిఫయర్ బి టోర్నమెంట్‌లో భాగంగా మలేషియా - చైనా మధ్య బుధవారం  జరిగిన టీ20 మ్యాచ్‌లో  ఇద్రుస్.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి  చైనా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఇద్రూస్ దెబ్బకు  చైనా..  11.2 ఓవర్లలోనే 23 పరుగులకే ఆలౌట్ అయింది.  ఇందులో ఆరుగురు డకౌట్ కాగా ఔట్ అయినవారందరూ క్లీన్ బౌల్డే కావడం గమనార్హం. 


అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఏడు వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ లేరు.  భారత బౌలర్లు దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్,  ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్  వంటి బౌలర్లు కూడా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా  ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇప్పుడు ఇద్రూస్ ఏకంగా ఏడు వికెట్లు తీసి   ప్రపంచ రికార్డు సృష్టించడం గమనార్హం. 


 






టీ20లలో బెస్ట్ బౌలింగ్ (టాప్-5) ప్రదర్శనలు :


- స్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషియా) : 7/8
-  పీటర్ అహో (నైజీరాయి) : 6/5 
- దీపక్ చాహర్ (ఇండియా) : 6/5 
- దినేశ్ నక్రాని (ఉగాండ) : 6/7 
- అజంతా మెండిస్ (శ్రీలంక) : 6/8 


 






స్వల్ప లక్ష్య ఛేదనలో  మలేషియా  కూడా తడబడింది.  24 పరుగులు ఛేదించడానికి  మలేషియా.. 4.5 ఓవర్లలో  2 వికెట్లు కోల్పోయింది. ఇక ఈ టోర్నీలో చైనా, మలేషియాతో పాటు భూటాన్, మయన్నార్, థాయ్‌లాండ్ కూడా పోటీ పడుతోంది. వీరిలో  టాప్ - 2గా నిలిచిన జట్లు వచ్చే ఏడాది యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.  






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial