MS Dhoni: భారత క్రికెట్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన  దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టు నుంచి తప్పుకున్నా అతడింకా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూనే ఉన్నాడు.  తమిళ అభిమానులు ఎంతో ఇష్టంగా ‘తాల’ అని పిలుచుకునే ధోని.. ఇటీవలే  ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్టార్ట్ చేశాడు.  ధోని భార్య  సాక్షి సింగ్ నిర్మాణ సారథ్యంలో  తెరకెక్కిన  ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాక్షికి  ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.  ‘ధోనీని భవిష్యత్‌లో నటుడిగా చూడొచ్చా?’ అన్న ప్రశ్నకు సాక్షి  అంతే ఆసక్తికర సమాధానం కూడా ఇచ్చింది. 


ఎల్‌జీఎం విడుదలకు ముందు  చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  సాక్షి ఇదే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఒకవేళ  క్యారెక్టర్ నచ్చి  ఆ పాత్రకు అవసరం ఉందంటే అతడు (ధోని) తప్పకుండా నటిస్తాడు. అతడేమీ కెమెరా ముందు సిగ్గుపడే రకం కాదు.  ఎలా నటించాలో ధోనికి తెలుసు.  2006 నుంచి  ధోని టీవీలలో యాడ్స్ చేస్తున్నాడు. ఒక పాత్రకు ధోని అవసరం ఉందని భావిస్తే  అతడు తప్పకుండా నటిస్తాడు. అందులో సందేహం లేదు..’అని తెలిపింది. 


ధోనీతో యాక్షన్ సినిమా తీస్తా.. 


ఇదే ఈవెంట్‌లో సాక్షి  మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ధోనీతో తాను సినిమా గనక తీస్తే  ఒక మంచి యాక్షన్ సినిమా తీస్తానని  చెప్పుకొచ్చింది. ‘నేనే గనక ధోనీతో ఒక సినిమా నిర్మించాల్సి వస్తే  మాత్రం ఒక మంచి యాక్షన్ సినిమా చేస్తా.  ఎందుకంటే అతడు ఎప్పటికీ యాక్షన్‌లోనే ఉంటాడు కదా..’ అని సరదాగా సంభాషించింది. 


 






ధోనీ జాబ్ ఆఫర్ లెటర్ వైరల్.. 


ఫీల్డ్‌లో ఉన్నా లేకపోయినా ధోనీ మాత్రం  ఆన్‌లైన్‌లో నిత్యం  ట్రెండింగ్‌లోనే ఉంటాడు.  తాజాగా ఈ జార్ఖండ్ డైనమైట్‌కు సంబంధించి.. 11 ఏండ్ల క్రితం తనకు వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.  2012లో (అప్పటికే టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ గెలిచాడు) ఇండియా సిమెంట్స్ (ప్రస్తుతం అతడు సారథిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్ కంపెనీ) అతడికి బంపరాఫర్ ఇచ్చింది.  ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా  నియమితుడయ్యాడు. ఆఫర్ లెటర్‌లో ధోనీకి  నెలకు వేతనంగా   రూ. 43 వేలు ఇచ్చినట్టు  అందులో ఉంది.  ఇందులో ఫిక్స్డ్  డీయర్‌నెస్ అలవెన్స్ కింద రూ. 21,790‌ ఇవ్వగా స్పెషల్ పే కింద  రూ. 20 వేలు ఇచ్చినట్టు ఉంది. జీతం కంటే కూడా  స్పెషల్ అలవెన్స్ కింద  రూ. 60వేలు  ముట్టజెప్పినట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. కాగా జీతం కంటే స్పెషల్ అలవెన్స్ ద్వారానే ధోనీకి ఎక్కువ డబ్బులు వచ్చాయని నెటిజన్లు  ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial