Revanth Reddy on Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి చెందారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు.


‘‘సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి 'విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం' ప్రదానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.


తెలంగాణ మహాకవి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా రవీంధ్ర భారతిలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తమిళ రచయిత్రి శివ శంకరికి “విశ్వంభర డా॥సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం” ప్రదానం చేశారు. అలాగే సినారె రచించిన “సమన్వితం” పుస్తకాన్ని ఆవిష్కరించారు.