Banakacharla Row: ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రపోజ్ చేసిన అతిపెద్ద ప్రాజెక్టు బనకచర్ల.  గోదావరి నీటిని సీమకు తరిలించే ఈ ప్రాజెక్టుపై ఏపీ చాలా శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే దాని కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఫండింగ్ ఎలా రాబట్టాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఓ వైపు ఏపీ ఈ ప్రాజెక్టుపై చకాచకా పనులు చేస్తుంటే.. ఇంకోవైపు తెలంగాణ కూడా చాలా వేగంగా మూవ్ అవుతోంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. నేడు అన్ని పక్షాల సమావేశం జరగనుంది.

బనకచర్లతో తెలంగాణకు నష్టం- ఉత్తమ్

బనకచర్ల ప్రాజెక్టుపై  చర్చకు ఆహ్వానిస్తూ అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పంపారు. బనకచర్ల ప్రతిపాదనకు  తమ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని.. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు చెప్పామని ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు. “ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బంకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది,  ఈ ప్రతిపాదనలను భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలు  ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ప్రాథమిక అధ్యయనంలో, ఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు ,ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది.  ఈ ప్రాజెక్ట్ తెలంగాణ నీటి హక్కుకు భంగం కలిగిస్తుంద”ని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ అభ్యంతరం – కేంద్రానికి లేఖ

గోదావరి బంకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ…  జనవరి 22, 2025న  కేంద్ర ఆర్థిక , జలశక్తి మంత్రులకు తాను లేఖ రాశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఎంపీలకు పంపించిన లేఖలో వివరించారు.గోదావరి-బంకచర్ల అనుసంధాన పథకం  DPR  కేంద్రానికి  అందలేదని, అయితే దానిని  "ప్రస్తుత మార్గదర్శకాలు, ప్రస్తుత ట్రిబ్యునల్ అవార్డులు/అంతర్ రాష్ట్ర ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యావస్థీకరణ చట్టం  APRA, 2014 కింద వివిధ నిబంధనల ప్రకారం" పరిశీలిస్తుందని హామీ ఇస్తూ, కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ తనకు  2025 మే 28న  సమాధానం ఇచ్చారని చెప్పారు.

 “నేను, సీఎం రేవంత్ రెడ్డి జూన్ ౩న కేంద్రమంత్రి C R పాటిల్‌ను నేరుగా కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం. ముఖ్యమంత్రి కేంద్రం మంత్రికి పంపిన లేఖలో ఈ అంశం కూడా ప్రధానంగా” ఉందని చెబుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రాసిన లేఖను ఎంపీలకు పంపారు. అలాగే జూన్ 13న మరో లేఖ రాసినట్లుగా కూడా చెప్పారు.  “ప్రస్తుతం జల్ శక్తి మంత్రిత్వ శాఖ CWC సమీక్షలో ఉన్న గోదావరి-బంకచర్ల పథకం యొక్క ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని నేను  అభ్యర్థించాను.” అని ఉత్తమ్ ప్రస్తావించారు.

 

సీఎం చీఫ్ గెస్టు- కేంద్రమంత్రుల గౌరవ అతిథులు

బుధవారం సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో జరిగే ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. గౌరవ అతిథులుగా హాజరవుతారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులందరికీ ఆహ్వానం పంపారు. ఏపీ ప్రతిపాదించిన ప్రాజెక్టుపై తాము ఇప్పటికే అభ్యంతరాలను తెలిపామని... దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే రేపు జరిగే సమావేశంలో చర్చిద్దాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించారు.

పార్లమెంట్ లో వ్యతిరేకించే వ్యూహం

బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై అఖిల పక్ష సమావేశం పెట్టమని  హరీష్‌రావ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టకుండా... అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎంపీలు లేరు కానీ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం అందింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల ఎంపీలకు ఆంధ్ర చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది. పార్లమెంట్ వేదికగా తెలంగాణ వాయిస్‌ వినిపించాలన్నది ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

తెలంగాణకు నష్టం  లేదు- ఏపీ

పోలవరం- బనకచర్ల  ప్రాజెక్టుల వల్ల  ఎగువ రాష్ట్రాలకులాంటి నష్టం లేదని… సముద్రంలోకి వృథాగా వెళుతున్న ౩౦౦౦ TMC ల నీటిని వాడుకోవడానికే ఈ ప్రాజెక్టులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.   “పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం - వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తాం - ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం” అని  ఏపీ నీటిపారుదల మంత్రి  నిమ్మల రామానాయుడు చెప్పారు. తెలంగాణమ చాలా  ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకుండానే  టెండర్లు పిలిచిన పరిస్థితిని తాము చూశామని  కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి లేకుండానే మీరు పనులు చేపట్టలేదా-? అని ఆయన ప్రశ్నించారు.  కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు తమ ఎగువున కట్టినా తాము సహకరించామన్నారు. “తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు ఎప్పుడూ లేదు - తెలంగాణలో ఎన్నోప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు సహకరించారు ” అని రామానాయుడు చెప్పారు.