PM Awas Yojana PMAY | హైద‌రాబాద్‌: ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (PM Awas Yojana) 2.0 కింద తెలంగాణ‌కు 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దేశ ప‌ట్ట‌ణ జ‌నాభాలో 8 శాతం ప్ర‌జ‌లు తెలంగాణ‌లో ఉన్నార‌ని కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కుకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీఏఎంవై (PMAYU)... ప‌ట్ట‌ణాభివృద్ధి, విద్యుత్ శాఖ‌ల‌పై బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్ శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. 


హైదరాబాద్ కొత్త మెట్రో కారిడార్లు


పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ. కనుక రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి స‌మ‌గ్ర‌మైన డాటా, పూర్తి ప్ర‌ణాళిక‌తో స‌న్న‌ద్ధంగా ఉన్నందున తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరుతో పోల్చితే హైద‌రాబాద్‌ (Hyderabad)లో మెట్రో క‌నెక్ట‌విటీ త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కింద ఆరు కారిడార్ల‌ను గుర్తించామ‌ని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో కారిడార్ -IV: నాగోల్‌ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ.), కారిడార్ -V:  రాయ‌దుర్గం- కోకాపేట నియోపొలిస్ వరకు (11.6 కి.మీ.), కారిడార్‌-VI: ఎంజీబీఎస్‌ - చాంద్రాయ‌ణ‌గుట్ట లైన్ (7.5 కి.మీ.), కారిడార్‌-VII:  మియాపూర్‌- ప‌టాన్‌చెరు మెట్రో లైన్ (13.4 కి.మీ.), కారిడార్-VIII: ఎల్బీ న‌గ‌ర్‌ నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ వరకు (7.1 కి.మీ), కారిడార్- IX:  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు- ఫోర్త్ సిటీ (Skill University) (40 కిలోమీటర్లు) అని తెలిపారు. 




ఇందులో మొద‌టి 5 కారిడార్ల‌ పనులకు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు సైతం పూర్త‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయం అవుతుంది. డీపీఆర్లు ఆమోదించ‌డంతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్త భాగ‌స్వామ్యం కింద చేప‌ట్టి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను తెలంగాణ సీఎం కోరారు. 


మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌ (Musi River Project)కు సహకారం అందించాలని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. మూసీలో మురుగు చేర‌కుండా న‌దికి రెండు వైపులా 55 కి.మీ. చొప్పున (మొత్తం 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులు అడిగారు. మూసీ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ తో పాటు స‌మీపంలోని 27 ప‌ట్ట‌ణ పాల‌క సంస్థ‌ల్లో డ్రైనేజ్ నెట్‌వ‌ర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్ల‌తో స‌మ‌గ్ర మురుగునీటి మేజ‌ర్ ప్లాన్ త‌యారు చేసినట్లు ఖట్టర్‌కు తెలిపారు. 
అమృత్ 2.0 (AMRUT 2.0) లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా సీఎస్ఎంపీని గుర్తించి నిధులు స‌మ‌కూర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణలో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ (Warangal) స‌మ‌గ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌ నోటిఫై చేసినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సిటీలో రూ.41,70 కోట్ల‌తో స‌మ‌గ్ర భూగ‌ర్భ నీటి పారుద‌ల ప‌థ‌కాన్ని చేప‌ట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించాల‌ని ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.


కేంద్ర మంత్రి అభినంద‌న‌లు...
దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.1.78 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు సాధించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్ అభినందించారు. దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌పాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని, తెలంగాణ 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌పాల‌ని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు.


Also Read: Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం