Harish Rao criticizes Revanth Reddy on Chandrababu banakacharla project:    తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న‌దే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం అయినా  కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాగునీటి విష‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని బీఆర్ఎస్ ఆరోపించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  గోదావ‌రి నీళ్ల‌ను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోందని..  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు బ‌న‌క‌చ‌ర్ల ఆపాల‌ని ఏపీకి క‌నీసం లేఖ కూడా రాయ‌లేదన్నారు. 

రాజెక్టుల‌కు అనుమ‌తుల సాధ‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లమైందని.. బ‌న‌క‌చ‌ర్ల‌కు నిధుల కోసం చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ‌లు రాశారని హరీష్ రావు గుర్తు చేశారు. . చంద్ర‌బాబు లేఖ‌పై కేంద్రంలో  ఫైళ్లు కదులుతున్నాయన్నారు. చంద్ర‌బాబు న‌వంబ‌ర్‌లో లేఖ రాస్తే సీఎం రేవంత్ ఏం చేశారు..? బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుందని వెంటనే ఆపే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.  

కృష్ణా జ‌లాల విష‌యంలో సెక్ష‌న్ 3ని సాధించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని హ‌రీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు సెక్ష‌న్ 3పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్తే క‌నీసం కేవియ‌ట్ వేయ‌రా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్ర‌భుత్వాన్ని అధికారులు స‌రిగ్గా మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేయ‌ట్లేదు. మంచి అడ్వ‌కేట్ల‌ను పెట్టి సెక్ష‌న్ 3 విష‌యంలో వాదించాలి క‌దా అని ప్రశ్నించారు. సాగునీటి మంత్రిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యారు. మేడిగ‌డ్డ‌ను పండ‌బెట్టారు.. పాల‌మూరును ప‌క్క‌కు పెట్టారు. ఇప్ప‌టికైనా న‌దీ జ‌లాలపై రాష్ట్ర ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలని సలహా ఇచ్చారు. 

నీటి సమస్యలపై అఖిల‌ప‌క్షం వేస్తే స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యానాథ్‌ను స‌ల‌హాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్య‌నాథ్ విష‌యంలో రేవంత్ గురుద‌క్షిణ చెల్లించారేమోనని హరీష్ మండిపడ్డారు. తుంగ‌భ‌ద్ర‌ను గండికొట్టేందుకు ఏపీ, క‌ర్ణాట‌క య‌త్నాలు చేస్తున్నాయి. ఏపీ, క‌ర్ణాట‌క తుంగ‌భ‌ద్ర‌కు గండి కొడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు..? 2017లో ఏపీ ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తే గ‌ట్టిగా అడ్డుకున్నాం అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళతాం అంటే కేసీఆర్ గారు గొడవ పడి, నిరసన తెలియజేస్తే నీళ్లు తీసుకెళ్ల లేదని హరీష్ రావు గుర్తుచేశారు. 

సముద్రంలోకి వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా పోతోందని వాటిని మళ్లించి రాయలసీమలోని బకనచర్లకు మళ్లించే ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల కోసం కేంద్రం వద్ద గట్టి ప్ర.యత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఎనభై వేల కోట్లు అవసరమయ్యే ఈ ప్రాజెక్టు చేపడితే..  తెలంగాణకు నష్టమని హరీష్ రావు వాదిస్తున్నారు. ఇటీవల ఓ సమావేశంలో ఈ ప్రాజెక్టు అంశంపై సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వానికి వెంటనే లేఖలు రాయాలని రేవంత్ ఆదేశించారు.