Abhishek Sharma faced an injury scare: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ గాయపడటంతో రెండో టీ20కి తను దూరమయ్యే అవకాశముంది. రెండో టీ20 వేదికైనా చెన్నై చేపాక్ స్టేడియంలో సాధన చేస్తుండగా అతను గాయపడ్డాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా మడమ బెణకడంతో అభిషేక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో డ్రెస్సింగ్ రూంకి నేరుగా కుంటుకుంటూ వెళ్లాడు. అక్కడే అరగంట సేపు గడిపాడు. అయితే ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్ కు తను రాలేదు. దీంతో చెన్నై మ్యాచ్ కు తను అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. తొలి టీ20లో భారత్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించడంతో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. 79 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు. అయితే తను గాయపడితే అతని స్థానంలో ఆడే క్రికెటర్ పై ఊహగానాలు చెలరేగుతున్నాయి.
తెలుగు ప్లేయర్ కు పట్టం..
ఒకవేళ అభిషేక్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనట్లయితే తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ నేరుగా ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశముంది. సౌతాఫ్రికా సిరీస్ లో రెండు వరుస సెంచరీలతో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. క్రికెట్ బుక్ లోని అన్ని షాట్లు ఆడగల సమర్థుడని ఇప్పటికే కితాబునందుకున్నాడు. దీంతో అభిషేక్ గైర్హాజరీలో తను కొత్త పాత్ర పోషించే అవకాశముంది. ఇక అభిషేక్ ప్లేసులో వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చే అవకాశముంది. పరిస్థితులను బట్టి టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. హోమ్ గ్రౌండ్ కావడంతోపాటు స్పిన్ కు చేపాక్ స్టేడియం అనుకూలిస్తుండటంతో వాషింగ్టన్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. లేకపోతే స్పెషలిస్టు బ్యాటర్ కావాలనుకుంటే జురెల్ ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు అభిషేక్ గాయంపైగానీ, తను ఆడటంపైగానీ ఎలాంటి అప్డేట్ రాలేదు.
దేశవాళీల్లో ఆడండి..
గతేడాది నుంచి టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన సహచరులకు ఒక సూచన చేశాడు. దేశవాళీల్లో ఆడితే స్కిల్స్ ఇంకా మెరుగవుతాయని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ ఐపీఎల్ కు దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ తక్కువేమీ కాదని, ఈ టోర్నీలో ఆడటం సవాలుతో కూడుకున్నదని తెలిపాడు. ముఖ్యంగా చిన్న బౌండరీలు ఉండే మైదానంలో నిలదొక్కుకోవడం బౌలర్లకు అంత సులభం కాదని, ఈ టోర్నీలో మ్యాచ్ లు ఆడటం ద్వారా బాగా రాటుదేలవచ్చని పేర్కొన్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో వరుణ్.. మూడు వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డివిరిచిన సంగతి తెలిసిందే. తన ప్రదర్శనకుగాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా సాధించాడు. ఇక తొలి టీ20లో విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉంది. చెన్నైలో గెలిచి తన లీడ్ ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
Also Read: Ind Vs Eng 2nd T20: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ఒక పేసర్ మార్పు.. భారత బ్యాటర్ల ధాటికి ప్రణాళికలు తలకిందులు..