Chennai T20 Live UPdates: తొలి టీ20లో ఓడిపోయినా నిరాశ పడకుండా ఇంగ్లాండ్ జట్టు తన నూతన పంథాను కొనసాగించింది. మ్యాచ్ కు 24 గంటల ముందే తుది జట్టును ప్రకటించే ఆనవాయితీని కొనసాగించింది. ఈసారి జట్టులో ఒక మార్పు చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ప్లేస్ లో బ్రైడెన్ కార్స్ ను జట్టులోకి తీసుకుంది. తొలి టీ20లో రెండు ఓవర్లలోనే తను 38 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ ను 12వ ఆటగాడిగా ప్రకటించింది. ఇక కొత్త సంవత్సరం ఆడిన తొలి టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ కు ఏదీ కలిసి రాలేదు. భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ లో విఫలమైన ఇంగ్లీష్ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ తేలిపోయింది. దీంతో మరో 43 బంతులు మిగిలి ఉండగానే ఓటమి పాలైంది. ఒక శనివారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో రెండో టీ20 ఆడబోతోంది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి, సిరీస్ సమం చేయాలని లక్ష్యంగా భావిస్తోంది.
పరిస్థితులకు తగినట్టుగా..
రాబోయే మ్యాచ్ లకు పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటామని తొలి టీ20లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ వ్యాఖ్యానించాడు. పిచ్, వాతావరణం తదిగర కారణాలను బేరీజు వేసి తుది జట్టును ప్రకటిస్తామని వెల్లడించాడు. దీంతో చెన్నైలో ఒక మార్పు చేసినట్లు సమాచారం. సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమి ఎదురైనా దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తామని తెలిపాడు. గెలుపోటములు పట్టించుకోమని, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తామని వెల్లడించాడు. ఇక ఆరంభంలో బౌలర్లకు సహకరించడంతోనే తాము పెద్దగా స్కోరు చేయలేక పోయామని, కోల్ కతా టీ 20పై వాఖ్యానించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు చాలా ఈజీగా మారిపోయిందని, అయినా అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిందేనని తెలిపాడు. బౌలర్లు చాలా చక్కగా బంతులు వేశారని, అయితే భారత బ్యాటర్ల దూకుడుతోనే ఓటమి పాలయ్యామని తెలిపాడు.
ఆ ఒక్క విషయంపై ఫోకస్ పెట్టాలి..
తొలి టీ20లో విజయం సాధించడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశాడు. బౌలర్లు తెలివిగా తమ ప్రణాళికలను అమలు చేయడంతో, ఛేదన తమకు చాలా ఈజీ అయిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడని, అర్షదీప్ కూడా ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి, ప్రత్యర్థిని ఆత్మ రక్షణలో పడేశాడని ప్రశంసించాడు. ఇక బ్యాటింగ్ లో టీమిండియా రాణించిందని తెలిపాడు. అయితే ఫీల్డింగ్ లో కాస్త మెరుగవ్వాల్సి ఉందని, ఫీల్డులో దొరికే ఆఫ్ ఛాన్సెస్ ను కన్వర్ట్ చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నాడు. ఇక జట్టులో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, ఆటగాళ్లకు వాళ్ల సామర్థ్యాలను బట్టి వివిధ బాధ్యలు కేటాయించామని, వాటిని సమర్థంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇక శనివారం చెన్నైలో జరిగే రెండో టీ20లో విజయం సాధించి, సిరీస్ లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే చెన్నైలోనే టీమిండియా ఆడే అవకాశముంది.