CM  Revanth  :    నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీకి రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపారు. నెల రోజుల కిందట  నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజినీ ( అనే యువతి  గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ( ని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీన ఏల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా దివ్యాంగురాలిని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీముల  కార్డుపై రేవంత్ రెడ్డి స్వయంగా తన దస్తూరీతో దివ్యంగురాలి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ ఆహ్వానం మేరకు రజనీకి ప్రత్యేక ఆహ్వానం పంపించారు రేవంత్ రెడ్డి


పలువురు ప్రముఖులకు ఆహ్వానం 


ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, కర్ణాటక సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ ముఖ్య నేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణకం ఠాగూర్, చిదంబరం, మీరాకుమారికి ఆహ్వానం పంపారు. సుశీల్ కుమార్ షిందే, కురియన్ లకు ఆహ్వానం అందింది. వీరిలో ఎంత మంది హాజరవుతారన్నది స్పష్టత లేదు. 


తొలి సంతకం చేసే ఫైల్ రెడీ 


ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హోదాలో ఆయన చేయబోయే తొలి సంతకం ఆరు గ్యారంటీల అమలుపైనే. దానికి తగినట్లుగా అధికారులు సంబంధిత ఫైళ్ళను సిద్ధం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు వివిధ విభాగాలకు చెందినవి కావడంతో ఆయా శాఖలు వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాల తయారీపై ఆ తర్వాత కసరత్తు మొదలుపెడతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తొలి సంతకం ఈ గ్యారంటీలపైనే చేస్తారని రాహుల్‌గాంధీతో పాటు రేవంత్ కూడా ఎన్నికల ప్రచారం సమయంలో స్పష్టత ఇచ్చారు. దానికి తగినట్లుగానే మొదటి సంతకాన్ని దానికి సంబంధించిన ఫైల్‌పైన పెడతారని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ సైతం ప్రజల పాలన ప్రారంభమవుతుందని సిక్స్ గ్యారంటీస్‌ను అమలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.


స్వాగతిస్తున్న ఉద్యోగులు 


ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు సచివాలయ ఉద్యోగుల్లో సంబురాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ రోడ్డు మీదకు వచ్చి సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద.. అనే పాట పెట్టుకుని డ్యాన్సులు చేశారు. మరికొద్దిసేపు బతుకమ్మ ఆడారు. సొంత రాష్ట్రం ఏర్పడితే పరాయి రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చని భావించి ఉద్యమంలోకి దూకామని, కానీ సొంత రాష్ట్ర పాలనలో మాత్రం పారదర్శకత, స్వేచ్ఛ లేకుండా తొమ్మిదేళ్ళు పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు వాపోయారు. కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా భయపడేవారమని, ఇప్పుడైనా ఇలాంటి భయానక వాతావరణం లేకుండా ప్రజలు కోరుకున్న పాలన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.