TDP Chief Chandra Babu News: టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అరెస్టు కారణంగా ఇన్ని రోజులు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరింత యాక్టివ్ అవ్వబోతున్నారు. నంద్యాలలో అరెస్టు తర్వాత టీడీపీ కేడర్ ఒక్కసారిగా డీలా పడింది. ఆయన అరెస్టు తర్వాత కార్యకలాపాలు కూడా మందగించాయి. ఈ మధ్య లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనలు రెడీ అవుతున్నారు.
జైలుకు వెళ్లడం, అనంతరం ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఇన్ని రోజులు రాజకీయ కార్యకలాపాలకు చంద్రబాబు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మధ్య ఎంపీలతో సమావేశమై పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ మధ్యకాలంలో ఏపీలో ఉన్న ప్రముఖ దేవాలయాలు సందర్శించారు. కోర్టుల్లో కూడా పూర్తిగా క్లియరెన్స్ వచ్చినందున తన దృష్టిని పూర్తి స్థాయి రాజకీయలపై పెట్టబోతున్నారు.
ముందుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారితోపాటు గవర్నర్‌కు కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయినా ఎలాంటి మార్పు రాలేదని భావిస్తున్న టీడీపీ... నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతోంది. అందులో భాగంగా చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల తొలగింపు, చేర్చడంపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.
ఢిల్లీలో ఇంకా ఎవరెవరితో భేటీ అవుతారు. ఇంకా ఏమైనా ముఖ్యమైన అపాయింట్‌మెంట్లు కోరబోతున్నారా అనేది మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి సీఈసీని కలవడం ఒక్కటే అజెండాలో ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముందుగా 11న శ్రీకాకుళంలో పర్యటిస్తారు. అక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అనంతరం 12న కాకినాడలో పర్యటిస్తారు. 14న నరసరావుపేట, 15న కడపలో చంద్రబాబు టూర్ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నారు.