Heavy Rains In Telangana Due To Michaung Cyclone: ఏపీలో తీరం దాటిన తుపాను మిగ్‌జాం కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. డిసెంబర్ నెలలో గతంలో ఎప్పుడూ లేనంత వర్ష పాతం నమోదు అయింది. చంద్రగొండ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. 307.8 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. తర్వాత స్థానాల్లో అశ్వారావుపేట ఉంది. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో 18 ప్రాంతాల్లో 100 ఎంఎం కంటే అత్యధిక వర్షపాతం రిజిస్టర్ అయింది. తర్వాత ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. 


తుపాను దిశ మార్చుకొని తెలంగాణలోకి ప్రవేశించినందున బుధవారం కూడా భారీ వర్షాలు ఈదురు గాలులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ముంలుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో వర్షాలు ఉంటాయని పేర్కొంది. వానలతోపాటు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ మధ్య గాలులు వీయవచ్చని కూడా తెలిపింది.



రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోతకు వచ్చిన పంటను రక్షించుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఇప్పటికే కోత కోసిన ధాన్యాన్ని తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కూడా తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 


వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు , అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు సీఎస్‌ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో ఆమె మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు కోత కోసిన పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


తుపాను కారణంగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రం పెరిగింది. చిన్నపిల్లులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. సికింద్రాబాద్‌, కాచిగూడ నుచి వెళ్లాసిన ట్రైన్స్‌ను కొన్నింటిని రద్దు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.