Rakhi Pournami 2023: హిందువులుందరికీ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వానికి మహిళల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందని... అందుకే ఎల్పీజీ సిలిండర్ మీద రూ.200 తగ్గించారని చెప్పుకొచ్చారు. అలాగే అదనంగా 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలకు గ్యాస్ ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల ప్రజల గురించి వ్యాట్ తగ్గిస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం అస్సలే తగ్గించలేదని గుర్తు చేశారు. ఇది చూస్తుంటేనే బీఆర్ఎస్ వైఖరి ఏంటో అర్థం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఉల్టా చోర్ కొత్వాల్ డాటే అన్నట్లుగా సీఎం తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. సీఎం చేతిలో ఉన్న అన్ని విభాగాల ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. 


ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న అన్ని ధరలు బీఆర్ఎస్ నేతలు పెంచేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. హౌస్ ట్యాక్స్, పెట్రోల్, జీజిల్ ధరలు పెంచారని వివరించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని అన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ సర్కారు... కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమైనా ఫర్వాలేదు కానీ తాము బాగుంటే చాలని కోరుకునే పార్టీ బీఆర్ఎస్ అంటూ విమర్శించారు. తెలంగాణలో తమకు నచ్చిన విధంగా భూములను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూములు ఇవ్వకుండా పంచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేదని విధంగా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం టెండర్లను పిలిచిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు బెల్టు షాపులు 24 గంటల పాటు ఏడాది పొడవునా ఉండేలా బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. మద్యం ఆదాయం లేకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ సర్కారు ఉందని విమర్శించారు. 






అలాగే మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని డా.వికాస్, ఆయన సతీమణి దీపా బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డాక్టర్‌ కే లక్ష్మణ్‌ లు కండువా కప్పి వారిని పార్టీలోని అహ్వానించారు. రాష్ట్రంలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కింద ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను సాధించడంలో వైద్యులు, సామాజిక కార్యకర్తలలుగా వీరి సహకారం చాలా విలువైనది అని కిషన్ రెడ్డి తెలిపారు.