Adani Case:


అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మరో 15 సంస్థలకు సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో బయటపడ్డట్టు సమాచారం. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు సహా 16 కంపెనీల గురించి సెబీకి ఈడీ వివరాలు సమర్పించిందని తెలిసింది.


తీవ్ర ఆర్థిక నేరాలు జరిగినట్టు ధ్రువీకరించుకోనంత వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు చేయలేదు. ఒక కంపెనీ నిబంధనలకు విరుద్ధం నడుచుకుంటుందని అనుమానం వచ్చినా, తప్పు జరుగుతున్నట్టు భావించినా క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ నమోదు చేసే అధికారాలు సెబీకి ఉన్నాయి. ఒకవేళ సెబీ ఆదేశిస్తే మనీ లాండరింగ్‌ కింద ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.


భారత స్టాక్‌ మార్కెట్లో జరిగిన అనుమానాస్పద కార్యక్రమాల్లో కొన్ని భారత, విదేశీ సంస్థల జోక్యం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమాచారం సేకరించినట్టు తెలిసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు, షార్ట్‌ సెల్లింగ్‌ వ్యవహారంలో వీరికి సంబంధం ఉన్నట్టు గమనించింది.


అదానీ గ్రూప్‌ కంపెనీల్లో షార్ట్‌ సెల్లింగ్‌ చేయడం వల్ల 12 కంపెనీలు ప్రయోజనం పొందాయని మంగళవారం వార్తలు వచ్చాయి. ఇందులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఉన్నారని సమాచారం. ఇందులో కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు వీలుండే ప్రాంతాల్లో ఆపరేట్‌ అవుతున్నాయి. కొన్ని డొల్ల కంపెనీలూ ఉన్నాయని సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది.


ఈ ఏడాది ఆరంభంలో అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీలపై ఓ నివేదికను బహిర్గతం చేసింది. ఆ దేశ సుప్రీం కోర్టు ఇవ్వొద్దని చెప్పినా ఇలాంటి నివేదికలు ప్రచురించి సోషల్‌ మీడియాలో పెట్టింది. దాంతో భారత స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. అదానీ గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్‌ విలువ 30-70 శాతం వరకు పడిపోయింది. గౌతమ్ అదానీ సంపద తుడిచి పెట్టుకుపోయింది.


సాధారణంగా షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేశాక ఆ కంపెనీలో లోపాలు, అక్రమాలు జరిగాయన్న రీతిలో హిండెన్‌బర్గ్ రిపోర్టు ఇస్తుంది. అంటే ముందుగానే ఆ కంపెనీ షేర్లను అత్యధిక ధరను అమ్మేస్తుంది. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టేంత వరకు ఎదురు చూస్తుంది. ఒక రేంజులో ప్రైజ్‌ క్రాష్ అయ్యాక తక్కువ ధరకు ఆ షేర్లను కొనుగోలు చేసి లబ్ధి పొందుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్లను రూ.1000 వద్ద అమ్మేస్తుందని అనుకుందాం. పానిక్‌ సెల్లింగ్‌ వల్ల ఆ షేరు రూ.500కు పడిపోగానే తిరిగి కొనుగోలు చేసుంది. అంటే ఒక్కో షేరుపై రూ.500 వరకు లాభం పొందుతుంది.


హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. సేకరించిన సమాచారాన్ని జులైలో సెబీకి సమర్పించిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. గుర్తించిన కంపెనీల్లో భారత్‌ నుంచి మూడు, మారీషన్‌ నుంచి నాలుగు ఉన్నాయి. వీటి యాజమాన్యం వివరాలు, స్ట్రక్చర్‌ గురించి ఆదాయపన్ను శాఖ వద్ద వివరాలేమీ నమోదు కాలేదని సమాచారం. హిండెన్‌బర్గ్‌ నివేదిక జనవరి 24న పబ్లిష్‌ అవ్వగా మూడు రోజులకు ముందుగానే కొన్ని కంపెనీలు అదానీ గ్రూప్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ చేశాయని తెలిసింది.


ఇన్వెస్టర్లు నష్టపోవడం, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో సుప్రీం కోర్టు అదానీ - హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై కమిటీ వేసింది. అదానీ గ్రూప్‌లో అక్రమాలు, షేర్ల ధరలను ఉద్దేశపూర్వకంగా పెంచారా అన్న దానిపై విచారణ జరిపించింది. కాగా కమిటీ ఇలాంటివేమీ జరగలేదని నివేదిక సమర్పించింది.