Best Police Station in India: హైదరాబాద్/ జైపూర్: దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ (Rajendranagar Police Station) నిలవడం తెలిసిందే. దేశంలోనే బెస్ట్ పీఎస్ ట్రోఫీని కేంద్ర హోం శాఖ నేడు ప్రదానం చేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం జరిగిన జరిగిన అన్నిరాష్ట్రాల డిజీపీల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) చేతుల మీదుగా రాజేంద్రనగర్ పీఎస్ హౌస్ ఆఫీసర్ బి.నాగేంద్రబాబు ట్రోఫిని అందుకున్నారు.
బెస్ట్ పీఎస్ అవార్డు అందుకున్న సీఐ నాగేంద్రబాబు
పోలీస్ స్టేషన్ల పని తీరుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పీస్ గా నిలిచింది. అత్యధిక కేసులు నమోదవుతున్న పీఎస్ గా కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ రికార్డు సృష్టించింది. కేసుల నమోదుతో పాటు విచారణ వేగవంతం చేసి, కేసులను ఛేదించడం, హత్య కేసుల్లో అత్యంత త్వరగా నిందితులను గుర్తించడం లాంటి పలు అంశాలల్లో ఈ పీఎస్ పనితీరు, పోలీసుల ప్రతిభను కేంద్రం హోం శాఖ గుర్తించింది. జైపూర్ లో జనవరి 5 నుంచి 7 వరకు జరగనున్న పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో అవార్డును అందజేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్రబాబు బెస్ట్ పీఎస్ అవార్డు తీసుకున్నారు.
గత ఏడాది దేశ వ్యాప్తంగా బెస్ట్ పీఎస్ అవార్డు కోసం పరిశీలించగా సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లాయి. అందులో మొదటగా 74 పోలీస్ స్టేషన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఆ 74 పీఎస్ లలో మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా.. తెలంగాణకు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అగ్ర స్థానం దక్కించుకుంది. రాజేంద్రనగర్ సీఎస్ తరువాత జమ్ముకాశ్మీర్‌కు చెందిన షేర్‌ఘరి, పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికి చెందిన సెరంపూర్ (చందన్‌నగర్ కమిషనరేట్) పోలీస్ స్టేషన్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే అత్యుత్తమ పొలీసు స్టేషన్ గా రాజేంద్రనగర్ మొదటి స్థానానికి ఎంపిక కావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను అభినందించారు.