Supreme Court Amaravati Case :  అమరావతిలో  ఆర్-5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ ఏప్రిల్‍కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు . వెంటనే  విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టీస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విజ్ఞప్తి చేశారు. అయితే   రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదేనని, ధర్మాసనం ముందు పెండింగ్‍లో ఉందని  రైతుల తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు.. నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని సింఘ్వీ వాదించారు.  ఏం జరుగుతుందో తమకు అన్నీ తెలుసన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా  సింఘ్వీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు.  ఏప్రిల్‍లో నాన్ మిస్లేనియస్ డే రోజు విచారణ జరుపుతామని తెలిపి వాయిదా వేసింది. 
 


అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో వాటి నిర్మాణాలు చేప‌ట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ 5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది. అమరావతిలో పరిధిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఆర్ 5 జోన్‌ను నోటిఫై చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.  ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపైనే  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 
 
మూడు రోజుల కిందట ఏపీ రాజధాని అమరావతి కేసు ఈ రోజు సుప్రీంలో  ఏప్రిల్‌కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినపిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. గత ఏడాది జూలైలో డిసెంబర్‌కు వాయిదా వేసింది. అయితే డిసెంబర్ లో విచారణకు రాలేదు. జనవరిలో విచారణకు వచ్చింది కానీ ఏప్రిల్ కు వాయిదా పడటంతో అప్పటికి ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోతుంది. రాజధాని అంశానికి ఓ ముగింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. 


అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.  అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు.  అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే  జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.