Tdp MP Kesineni Nani Sensational Comments on Chandrababu: విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి (Kesineni Nani) షాక్ ఇస్తూ టీడీపీ అధిష్టానం బెజవాడ (Vijayawada) ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయించింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ నానియే తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హైకమాండ్ నిర్ణయం తర్వాత తాజాగా కేశినేని నాని విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని.. అలా చేసుంటే ఇంకా మంచి పదవిలో ఉండే వాడిని అంటూ చెప్పారు. 'నన్ను వద్దని చంద్రబాబు (Chandrababu) అనుకున్నారు. నేను మాత్రం అనుకోలేదు. చంద్రబాబుతో రోజూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాను. నామినేషన్ల చివరి వరకూ అభ్యర్థులను తేల్చేవారు కాదు. కానీ, నా విషయంలోనే చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచినా గెలుస్తానని గతంలోనే చెప్పా. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. నేను పార్టీలో కొనసాగడంపై అభిమానులు నిర్ణయిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం ప్రకటిస్తాను. ప్రస్తుతానికి నా బాస్ చంద్రబాబు. ఆయన చెప్పినట్లే వింటాను.' అని కేశినేని నాని స్పష్టం చేశారు.


తినబోతూ రుచులెందుకు.?


బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్లు తనకు అధిష్టానం స్పష్టం చేసిందని కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తిరువూరు ఘటన తర్వాత అధిష్టానం సీటుపై క్లారిటీ ఇచ్చింది. 'ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా నన్ను జోక్యం చేసుకోవద్దని అధినేత చంద్రబాబు ఆదేశించారు. అధినేత ఆజ్ఞలను తు.చ తప్పకుండా శిరసావహిస్తానని నేను హామీ ఇచ్చా.' అంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మీడియా చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తినబోతూ రుచులెందుకు.?, మీరే చూస్తారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో' అన్న ఎంపీ వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. 


'మీకు కావాల్సింది మసాలేనా.?'


ఫేస్ బుక్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని, అంతకు మించి కొత్తగా చెప్పేది ఏమీ లేదని కేశినేని నాని ఈ సందర్భంగా అన్నారు. 'రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టాను. కానీ మీడియాకు కావాల్సింది మసాలేనేగా.. తినబోతూ రుచులెందుకు.? ఒకే రోజు అన్ని విషయాలు ఎందుకు.?' అని ప్రశ్నించారు. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు.. రేపటి విషయం ఎల్లుండికి కరెక్ట్ కాకపోవచ్చని, అది ఎవరికి ఎలా అర్థమైతే అలా ఇచ్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు. మీడియాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని అన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేసిందని, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నారని గుర్తు చేశారు. ఇక, 2024 మే వరకూ తానే ఎంపీ అని, నా రాజకీయ భవిష్యత్తు విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారంటూ స్పష్టం చేశారు. ఈ నెల 7న తిరువూరు వెళ్లడం లేదని కేశినేని నాని తెలిపారు. 'నేను వెళ్తే నా వాళ్లు ఆగరు. గొడవలు అవుతాయి. ఎవరి నసీబ్ ఎలా ఉందో అప్పుడే ఎలా తెలుస్తుంది.?. నేను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తా. ఓ ఫ్లైట్ పోతే ఇంకో ఫ్లైట్ ఢిల్లీకి ఉంటుంది. గొడవలు పడడం నా తత్త్వం కాదు. అలా అయితే యువగళంలోనే గొడవలు జరిగేవి.' అని పేర్కొన్నారు.


Also Read: Vijayawada MP Kesineni Nani: విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ఔట్‌- క్లారిటీ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టు