People Attacked a Man in NTR District: ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు (Penuganchiprolu) మండలం అనిగండ్లపాడు (Anigandlapadu)  గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించి అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు వినియోగించిన ప్రైవేట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాథ్ పై స్థానికులు దాడి చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో ఇద్దరు పోలీసులు, త్రినాథ్ కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా  ఆ ముగ్గురూ కలిసి గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని.. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


వర్గ విభేదాలు కారణమా.?


అయితే, ఈ వివాదానికి వైసీపీలో వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది. గ్రామంలో సర్పంచ్ భర్త, త్రినాథ్ వర్గానికి కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్రినాథ్ వర్గంలోని వారు గత రాత్రి సర్పంచ్ భర్తకు చెందిన లారీకి నిప్పు పెట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు త్రినాథ్ ను అదుపులోకి తీసుకునేందుకు గ్రామానికి రాగా.. గ్రామస్థులు హల్చల్ చేశారు. నిందితునిపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Also Read: YSRCP MLC Car Accident: వైసీపీ ఎమ్మెల్సీ కారు బోల్తా.. పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు