Breaking News Telugu Live Updates: న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..

ABP Desam Last Updated: 29 Oct 2022 03:24 PM
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ

రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకురావాలని మూడు రాజధానులకు  మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారాయన. ఈ కార్యక్రమంలో వేల మంది మహిళలు, యువకులు పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు.


కృష్ణాపురం ఠాణా నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో వేల మంది ప్రజలు గాంధీ రోడ్డు తిలక్ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  సభలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో జరిగిన ఆత్మ గౌరవ మహా ప్రదర్శన పట్ల  ప్రజల స్పందన తెలియజేసేందుకు ఇది ఒక రిహార్సల్స్‌ మాత్రమే అన్నారు. అంచనాలకు మించి ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారని పేర్కొన్నారు. 

కస్తూర్బా విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫైర్

వరంగల్ : దేవరుప్పుల మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెండు క్రితం భోజనంలో బల్లి పడడంతో స్కూల్ ను సందర్శించి విద్యార్థినిలతో కలిసి స్కూల్ సమస్యలను తెలుసుకున్నరూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మినిస్టర్ వెంట కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది
పాఠశాల అవసరాల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తునం అని బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుండి స్కూల్ కి లక్ష రూపాయలు అందచేశారు.  విద్యార్థులతో పాటు కూర్చొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సంఘటన జరిగిన తల్లితండ్రులకు సమాచారం ఇవ్వని ప్రిన్స్ పాల్  తీరుపై మండిపడ్డరూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

స్థానిక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే: విష్ణు వర్థన్ రెడ్డి

బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని విష్ణు వర్థన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా మాట్లాడుతూ... ఏపీ రాజకీయాలు దేశ ప్రజలలో ఆందోళన నింపుతున్నాయి అన్నారు. స్థానిక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే సాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ పదేళ్లు వెనక్కి పోగా, ఇప్పుడు వైసీపీ పాలనతో మరో ఇరవై ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు 
వైసీపీ చేతగానితనాన్ని ఎండగడతాం..
కుటుంబ పాలనే పరమావధిగా నాడు టీడీపీ, నేడు వైసీపీ వ్యవహరిస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 18 నెలలు వైసీపీ చేతగానితనాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ, జనసేన ప్రజా అవగాహన ఉద్యమాలు చేపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పధంలో నడవాలి అంటే అది కేవలం బిజేపీ, జనసేనలతోనే సాధ్యం అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ ప్రమాదకరమైనది అన్నారు. సంతలో పశువుల్లా కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గత మూడు రోజులుగా నీచ రాజకీయాలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. నేడు దేశంలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ చేపట్టి పాదయాత్ర భారత్ జోడో యాత్రను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు అని జోస్యం చెప్పారు.

ఈ 31న రాజమండ్రిలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

ఈ నెల 31న రాజమండ్రిలోని ఓ హోటల్‌లో  వైఎస్‌ఆర్‌ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమావేశంకానున్నారు. కాపు నేతల గురించి తాజాగా పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం వైఎస్‌ఆర్‌ సీపీ కాపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ లు రానున్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే తలంటు స్నానం చేసి మహిళలు ఆలయాలకు చేరుకున్నారు. పుట్టల వద్ద ప్రదక్షణలు చేసి పుట్టలో పాలు పోశారు. నాగేంద్ర స్వామి శిలలకు పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో నాగుల చవితి పర్వదినం ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రధాన ఆలయాల్లో ఉదయాన్నుంచే పూజలు మొదలయ్యాయి. ఈరోజు మహిళలంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమిస్తారు. దీక్ష చేపట్టే మహిళలు ఉదయాన్నే పుట్ట వద్దకు వచ్చి నాగారాధన చేస్తారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే నాగ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సంతానం కోసం నాగుల చవితి రోజున మహిళలు పూజలు చేస్తుంటారు. 

తిరుపతి శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు

తిరుమల శ్రీవారి‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్మృతి ఇరానీ దంపతులు స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు..స్వామి వారి దర్శనార్ధం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులకు టిటిడి‌ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు..  అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

పుట్టిన రోజున శ్రీనివాసుడి‌ సన్నిధిలో‌ రాఘవ లారెన్స్

తిరుమల శ్రీవారిని సినీ‌నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాఘవ లారెన్స్ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి‌ తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన రాఘవ లారెన్స్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాసుడి ఆశీర్వాదం కోసం తిరుమలకు రావడం జరిగిందని, నాకు దేవుడు అన్ని ఇచ్చాడని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.. అదే విధంగా భక్తులు కోరిన కోర్కెలు అన్ని‌ నేరవేర్చాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.. ఏప్రిల్ 14వ తారీఖున రుద్రన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రాఘవ లారెన్స్ తెలియజేశారు..

రాహుల్ గాంధీ పాదయాత్రలో పూనమ్ కౌర్, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరిన నటి

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్  ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. 

Background

ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52 వ రోజుకు చేరుకోగా, తెలంగాణలో 4వ రోజు పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర మొదలుపెట్టగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్.


రాహుల్ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్..
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్  ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. 


నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు నేడు ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
అక్టోబర్ 19 నుంచి ఈశాన్య రుతుపవనాల వాతావరణం కొనసాగుతూ వచ్చింది. వాతావరణ శాఖ అధికారులు ఈశాన్య రుతుపవనాల రాకపై నేడు ప్రకటించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలను మనం చూశాం, కానీ ఈ సారి మరీ అంతగా కాకపోయినా నవంబర్ నెలలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుంది. తమిళనాడు వైపుగా అల్పపీడనాలు వచ్చే ప్రతి సారి నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలతో పాటుగా అన్నమయ్య, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి, అవి కూడా కోస్తా (సముద్ర తీరానికి దగ్గర) భాగాల్లో మాత్రమే ఉంటాయని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రివేల చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో  వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
సిత్రాంగ్ తుపాను తీరాన్ని దాటిన మూడు రోజులకు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేడు ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. మరోవైపు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలో వర్షాలు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు, చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలున్నాయి. నేడు సీమలోని మిగిలిన జిల్లాల్లో, ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలుండవని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.