Earthquake of Magnitude 4.0 hits Delhi-NCR : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. దాంతో ఢిల్లీ ప్రజలు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. 


ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిందని, భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని సూచించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ఢిల్లీ సహా పరిసర ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.






భయాందోళనకు గురైన ప్రజలు


ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తి ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. మంచి నిద్రలో ఉన్నాం. అంతలోనే ఏదో కదులుతున్నట్లు అనిపించింది. లేచి చూస్తే బిల్డింగ్ మొత్తం ఊగుతోందని గమనించి ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టాం. అయితే ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని తెలిపాడు.






రైలు వైబ్రేషన్‌లోనూ భూ ప్రకంపనులు గుర్తించాం


న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న వారు భూంకంపంపై స్పందించారు. కొన్ని సెకన్లే భూమి కంపించింది. కానీ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. రైల్వేస్టేషన్లో రైలు కదులుతుంటే మనకు అంతగా తెలియదు. కానీ తాజా భూప్రకంపనలు మాత్రం గుర్తించేలా వచ్చాయి. రైలు కోసం వేచి చూస్తున్నవారు కాసేపు ఆందోళనకు గురయ్యారు. సమీపంలో ఏమైనా బ్రిడ్జి లాంటివి కూలిపోయయా అనే అనుమానం వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రెండు రోజుల కిందట జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారని తెలిసిందే.






Also Read: US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్