Telangana BJP :  ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన సన్నాహాలను జోరుగా చేసుకుంటోంది. తాజాగా అన్ని రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించింది. తెలంగాణ ఇంచార్జ్ గా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు సహాయకుడిగా..కో ఇంచార్జ్ గా.. ప్రస్తుత తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న సునీల్ బన్సల్ వ్యవహరిస్తారు. ప్రకాష్ జవదేకర్ 2014 ఎన్నికల సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ తరపున కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ప్రకాష్ జవదేకర్ అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వెళ్లారు. పార్టీ పనుల్లో ఇటీవల బిజీగా ఉంటున్నారు. ఎన్నికల టాస్క్ లు నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉండటంతో మరోసారి ప్రకాష్ జవదేకర్ ను ఇంచార్జ్ గా తెలంగాణకు నియమించినట్లగా తెలుస్తోంది. 






కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వెనుకబడిందన్న వాతావరణం ఏర్పడింది. పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోగా ఉన్న వారు కూడా వెళ్లిపోతారన్న పుకార్లు వచ్చాయి. దీంతో అప్రమత్తమయిన హైకమాండ్.. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. తెలంగాణ  బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను తప్పించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీలో చేరి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. వీరిద్దరి నేతృత్వంలోనే ఎన్నికలు ఎదుర్కోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. 


అయితే ఈ మార్పుల కారణంగా తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన ప్రచారం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఓ అవగాహనకు వచ్చాయన్న అనుమనాలు బలంగా వినిపిస్తోంది. దీంతో ఇవన్నీ రూమర్సేనని బీజేపీ బలంగా విజయం కోసం ప్రయత్నించబోతోందని నిరూపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ప్రకాష్ జవదేకర్ అయితే అన్ని విషయాలను సమర్థంగా డీల్ చేయగలరని.. గతంలో ఇక్కడ పని చేసిన అనుభవం ఉండటంతో.. అన్ని  విధాలుగా సమర్థంగా పని చేస్తారన్న నమ్మకంతో నియమించినట్లుగా తెలుస్తోంది. 


ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ శనివారం జరగనున్న ప్రధాని మోదీ పర్యటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. వరంగల్ లో జరగనున్న సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి  జనం తరలి వచ్చేలా పార్టీ నేతల్ని కొత్త నేతల్ని కిషన్ రెడ్డి పురమాయిస్తున్నారు. ఈ సభలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడటం ద్వారా .. ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని మోదీ సందేశం ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.