Jonny Bairstow: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇటీవలే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టులో ఆథిత్య జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఓవర్ ముగిసిందన్న తొందర్లో బెయిర్ స్టో.. క్రీజు దాటి ముందుకు పోవడంతో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ త్వరగా స్పందించి త్రో విసిరాడు. దీంతో బెయిర్ స్టో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. లార్డ్స్ లో వికెట్ కోల్పోయిన భయమో మరే కారణమో గానీ లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం క్రీజును వీడలేదు.
బ్యాట్ తీస్తే ఒట్టు..
హెడింగ్లీ (లీడ్స్) వేదికగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో ఆట చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన బెయిర్ స్టో.. మిచెల్ మార్ష్ వేసిన 14వ ఓవర్ లో వచ్చీరాగానే క్రీజును అతుక్కుపోయాడు. తాను ఎదుర్కున్న తొలి బంతిని మిడాన్ దిశగా ఆడిన బెయిర్ స్టో పరుగేమీ రాకున్నా ముందుకొచ్చిన భయంతో మళ్లీ వెంటనే క్రీజులోకి వచ్చి బ్యాట్ తీయకుండా పట్టుకున్నాడు.
ఇదే ఓవర్లో ఆఖరి బంతిని కట్ చేయబోయాడు. కానీ బాల్ మిస్ అయ్యి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది. అయితే కేరీ బాల్ పట్టి అతడు తిరిగి అవతలి ఎండ్ కు వెళ్లే క్రమంలో సగం క్రీజు దాటేదాకా బెయిర్ స్టో బ్యాట్ తీయకుండా అలాగే పట్టుకున్నాడు. క్రీజును దాటే క్రమంలో బెయిర్ స్టో.. ఆసీస్ ఆటగాళ్లను ఓరకంట చూస్తూ ‘ఇదిగో చూశావా, బ్యాట్ క్రీజులోనే ఉంది’అన్నట్టుగా లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మార్ష్ సెంచరీ.. వుడ్ ఫైపర్
ఇక లీడ్స్ టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా మొదలైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఇంగ్లాండ్ ఆహ్వానం మేరకు ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా 60.4 ఓవర్లలో 263 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ షేన్ వార్నర్ (3), ఉస్మాన్ ఖవాాజ (13), మార్నస్ లబూషేన్ (21) తో పాటు వందో టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్ (22) కూడా విఫలమయ్యారు. కానీ ట్రావిస్ హెడ్ (39) అండతో మిచెల్ మార్ష్ (118 బంతుల్లో 118, 17 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆసీస్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 155 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లను మార్ష్ ఆటాడుకున్నాడు.
కానీ ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ సంచలన స్పెల్ తో ఆసీస్.. 239-4 నుంచి 263కి ఆలౌట్ కావడం గమనార్హం. అతడు వేసిన 53వ ఓవర్లో హెడ్ ఔట్ కాగా ఆ తర్వాత వరుసగా మార్ష్, మిచెల్ స్టార్క్, కమిన్స్, మర్ఫీల పనిపట్టాడు. ఆసీస్ ఆఖరి ఆరు వికెట్లను 26 పరుగుల తేడాతో కోల్పోయింది. వుడ్.. 11.4 ఓవర్లే బౌలింగ్ చేసి 4 మెయిడిన్లు వేయడమే గాక ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇంగ్లాండ్ టాపార్డర్ ఖతం..
ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషం ఇంగ్లాండ్ కు ఎంతోసేపు నిలువలేదు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక నాలుగో ఓవర్లోనే బెన్ డకెట్ (2) ను కమిన్స్ ఔట్ చేశాడు. వన్ డౌన్ కు ప్రమోట్ అయిన హ్యారీ బ్రూక్ (3) కూడా కమిన్స్ చేతికే చిక్కాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో మార్ష్.. జాక్ క్రాలే (33) ను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్.. 65 పరుగులకే టాపార్డర్ ను కోల్పోయింది.