MS Dhoni Birthday: భారత దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని జంతు ప్రేమికుడు.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మూడు నెలల పాటు  ఐపీఎల్ సీజన్ ముగిసిందంటే మళ్లీ ధోని కనిపించేది చాలా అరుదు.  ఇంటిదగ్గర ఉంటే తన స్వంత ఊరు రాంచీ (జార్ఖండ్)లోని వ్యవసాయం క్షేత్రంలో పనిచేసుకుంటూ గడిపే ధోని..  ఇంట్లో ఉన్న  కుక్కలు, గుర్రం, ఇతర పెట్స్ తోనే కాలక్షేపం చేస్తుంటాడు. 


కుక్కలకు పేర్లు.. 


ధోని వద్ద సుమారు మూడు జతల కుక్కలు ఉన్నాయి.  వీటిలో బెల్జియన్ షెపర్డ్ పెయిర్ (జత) ఒకటి కాగా సైబేరియా జాతికి చెందిన  వైట్ హస్కీస్, డచ్ షెపర్డ్ ఉన్నాయి.  ధోని వీటికి పేర్లు కూడా పెట్టాడు.  ధోని వీటికి  జరా, సామ్, లిల్లీ, గబ్బర్, జోయా అని పేర్లు కూడా పెట్టాడు.  ధోని ఎక్కడికి వెళ్లినా  తన కుటుంబంతో సహా  వీటిలో  రెండింటినైనా వెంట తీసుకెళ్తాడు. ఇంట్లో ఉంటే మాత్రం  కాలక్షేపం అంతా వీటితోనే.. 


ఈ శునకరాజులను ధోని అపురూపంగా చూసుకుంటాడు. ఇంట్లో ఉండే ఉదయాన్నే వాటితో వ్యాయామాలు,  స్నానం చేయించడంతో పాటు  వాటి ఆహార అవసరాలను కూడా మహీనే చూసుకుంటాడు.  గతంలో  ధోని..  ఓ ఫౌండేషన్ సాయంతో వీధికుక్కలను దత్తత తీసుకున్నాడని, వాటి  బాగోగులు చూసుకోవడానికి ముందుకొచ్చాడని వార్తలు వచ్చాయి. 


 






‘ఛేతక్’కు కూడా.. 


ఖరీదైన కుక్కలతో పాటు ధోని 2011 నుంచి ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నాడు.  దీని పేరు ఛేతక్..   జరా, సామ్, లిల్లీతో పాటు ఛేతక్ తో  కూడా ధోని  కాలక్షేపం చేస్తుంటాడు.   ఛేతక్ తో  ధోని ఆడుకుంటున్న వీడియోలు, ఫోటోలను గతంలో  అతడి భార్య సాక్షి  సోషల్ మీడియాలో పంచుకోగా అవి కాస్తా వైరల్ అయిన విషయం తెలిసిందే. 


 






ఫామ్ హౌస్ లో.. 


ఇంట్లో పెంచుకునే జంతువులే గాక ధోని తన వ్యవసాయ క్షేత్రంలో  పాడి ఆవులను, కోళ్లను కూడా   పెంచుతున్నాడు.   ఆవులు, గేదెలకు ప్రత్యేకంగా ఓ షెడ్డును వేయించి వాటి  సంరక్షణకు భారీగా వెచ్చిస్తున్నాడు.   వాటి విసర్జితాలను  తన పొలంలో వాడుకుంటూ.. సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాడు. ధోని కుటుంబానికి  నిత్యావసరాలైన కూరగాయలు, పాలు వంటివి  అన్నీ అతడి ఫామ్ నుంచే వస్తాయి.  గతంలో ధోని  అధిక  పోషకాలు ఉండే గిరిరాజా కోళ్లను పెంచాడు. 


 












Join Us on Telegram: https://t.me/abpdesamofficial