MS Dhoni Birth Day Special:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బర్త్ డే సందర్భంగా ధోనీ తన ఫామ్ హౌస్‌లో ఏం పండిస్తాడో ఓసారి చూద్దాం. ధోనికి తన స్వస్థలం రాంచీలో ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ అతను అనేక రకాలైన పంటలను సాగు చేస్తాడు.తన ఫామ్ హౌస్‌లో ఏం పండిస్తానో ఓసారి ధోనీయే స్వయంగా చెప్పాడు.


స్వరాజ్ ట్రాక్టర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ తన ఫామ్‌హౌస్‌ గురించి వివరించాడు. తాను పండించే పంటల గురించి అక్కడ ఉండే మొక్కలు గురించి మాట్లాడాడు. 'ఈ జాబితా చాలా పెద్దది. మొదట పుచ్చకాయలు పండించాం. అని చెప్పారు. 


'తర్వాత వాటర్‌మిలన్‌, బొప్పాయితో మొదలుపెట్టాం. అలా అనేక పండ్ల తోటలను పెంచాం. జామతో చెట్లను నాటాం. వీటితోపాటు పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పసుపు, అల్లం ఇలా చాలా వాటిని పెంచారు. మామిడి చెట్లు నాటాలని అనుకున్నాను.






తనకు 40 ఎకరాల భూమి ఉందని ధోనీ తెలిపాడు. కోవిడ్-19 సమయంలో వ్యవసాయంలో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని చెప్పారు. ఇక్కడ పండ్ల నుంచి కూరగాయల వరకు చాలా రకాలు పండిస్తాడు ధోనీ. ధోనీ ఫామ్ హౌస్‌లో అనేక రకాల ఆవులు ఉన్నాయని, వాటి పాలను కూడా అతను అమ్ముతాడని సన్నిహితులు చెబుతారు. ఇవే కాకుండా ఆయన ఫామ్ హౌస్ లో అనేక జంతువులు ఉన్నాయి.


కొన్ని నెలల క్రితం (ఫిబ్రవరి 8న) ధోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతను తన పొలంలో ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్నాడు. ధోనీకి సంబంధించిన ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ వీడియోను 53 లక్షల మందికిపైగా లైక్ చేశారు.






2004లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. ఐపీఎల్లో చెన్నై ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీకి ఎన్నో రికార్డులు ఉన్నాయి. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేని కొన్ని రికార్డులు కూడా ఈ మిస్టర్‌ కూల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 


ధోని 2004 నుంచి 2019 వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌లలో 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. వన్డేల్లో 50.57 సగటుతో 10773 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ధోని 37.60 సగటు, 126.13 స్ట్రైక్ రేట్‌తో 1617 పరుగులు చేశాడు. ధోనీ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు సాధించాడు.