Ashes 2023: 


యాషెస్‌ సిరీసులో ఇంగ్లాండ్‌ ఆటతీరును ఆసీస్‌ లెజెండ్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ విమర్శించాడు. ఆంగ్లేయులు తమదైన రీతిలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నాడు. వాళ్లు 'బాజ్‌ బాల్‌'కు బదులు 'కాజ్‌ బాల్‌' అప్రోచ్‌తో ఆడుతున్నారని ఎద్దేవా చేశాడు.


ప్రస్తుతం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఐదు టెస్టుల యాషెస్‌ సిరీసులో (Ashes Series 2023) తలపడుతున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించిన ఆసీస్‌ 2-0తో ముందంజ వేసింది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ వారి వశం అవుతుంది. దాంతో ఆంగ్లేయులు ఆట తమ సొంతమైనట్టుగా ఆడుతున్నారని విమర్శించాడు. వారు క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడటం నవ్వు తెప్పిస్తోందని అన్నాడు. ఈ మధ్యన ఇంగ్లాండ్‌ టీమ్‌ టెస్టుల్లో దూకుడుగా ఆడుతోంది. దాన్ని 'బాజ్‌ బాల్‌' దృక్పథంగా చెప్తున్నారు. కానీ యాషెస్‌లో అందుకు బదులుగా 'కాజ్‌ బాల్‌' (క్యాజువల్‌) ఆటిట్యూడ్‌తో ఆడుతోందని మెక్‌గ్రాత్‌ ఉద్దేశం.


'జానీ బెయిర్‌స్టో ఔటైన తీరుపై నేను మొదట మాట్లాడతాను. అదేమీ నా ఫేవరెట్‌ కాదు. చాలాసార్లు దాని గురించి ఆలోచించాను. అందరి స్పందనలను గమనించాను. ఇది నన్ను ద్వంద్వ మనస్థితికి తీసుకెళ్లింది. నిజానికి ప్యాట్‌ కమిన్స్‌ తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే నేను సంతోషించేవాడిని. అయితే ఎక్కువగా ఆలోచించే కొద్దీ అతడిది సరైన నిర్ణయమే అనిపించింది. ఇంగ్లాండ్ మనస్తత్వాన్ని కూలంకషంగా పరిశీలిస్తే నిర్ణయంలో తప్పేం లేదనిపించింది' అని మెక్‌గ్రాత్‌ అన్నాడు.


'నేను బాజ్‌ బాల్‌ అభిమానిని. తమను తాము నమ్మడం, భయం లేకుండా ఆడటం, ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. కానీ జానీ బెయిర్‌స్టో ఔటైన తీరును బాగా పరిశీలిస్తే ఈ సిరీసును క్యాజువల్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది. అందుకే నేను దీన్ని బాజ్‌ బాల్‌ కాకుండా కాజ్‌బాల్‌ అంటున్నాను. లార్ట్స్‌ టెస్టు నుంచీ వారిలాగే ప్రవర్తిస్తున్నారు. తొలి రోజు వర్షం తర్వాత ఆసీస్‌ బ్యాటర్లు క్రీజులోకి రావడానికి సిద్ధమయ్యారు. అంపైర్లు సైతం వచ్చేశారు. పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నా కెప్టెన్‌ సహా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బాల్కనీలోనే సమయం గడిపారు' అని మెక్‌గ్రాత్‌ అన్నాడు.


Also Read: అదృష్టం వల్లే కపిల్‌ డెవిల్స్‌ '1983' గెలిచిందన్న ఆండీ రాబర్ట్స్‌!


'తొలి టెస్టు తొలిరోజే ఇంగ్లాండ్‌ డిక్లేర్‌ చేయడం క్యాజువల్‌గా అనిపించింది. ఆఖరి రోజు కామెరాన్‌ గ్రీన్‌ వేసిన స్లో బౌన్సర్‌ తనను దాటి వెళ్లగానే బెయిర్‌స్టో క్రీజును వదిలేశాడు. బాల్‌ డెడ్‌ అయిందని భావించి పిచ్‌ మధ్యలో బెన్‌స్టోక్స్‌తో మాట్లాడేందుకు వెళ్లాడు. అలెక్స్‌ కేరీ నిబంధనల మేరకే స్టంప్స్‌కు బంతి విసిరాడు. మరియస్‌ ఎరాస్మస్‌ ఆస్ట్రేలియాకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ వారం క్రికెట్‌ స్ఫూర్తి గురించి చాలా విన్నా. అయితే టెస్టు క్రికెట్‌ను మీ ప్రవర్తనతోనూ గౌరవించాల్సిన అవసరం ఉంది.. బెయిర్‌స్టో ఔటైన విధానాన్ని బట్టి వారు యుద్ధం మధ్యలో ఉన్నారన్న సంగతి మర్చిపోయారేమో అనిపిస్తోంది' అని మెక్‌గ్రాత్‌ కఠినంగా విమర్శించాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial