Team India T20 Squad: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వచ్చే నెల 3 నుంచి విండీస్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా వివరాలను వెల్లడించింది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా నియమించగా.. గత రెండు ఐపీఎల్ సీజన్స్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా మెరుపులు మెరిపిస్తున్న ముంబై సంచలనం యశస్వి జైస్వాల్, ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మలకు తొలిసారి టీ20 టీమ్ లో చోటు దక్కింది. విండీస్ తో టీ20 సిరీస్ కు తప్పకుండా ఎంపికవుతాడని అందరూ భావించినా.. కోల్కతా నైట్ రైడర్స్ ఆపద్బాంధవుడు రింకూ సింగ్ కు నిరాశ తప్పలేదు.
15 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ లో వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్ తో పాటు సంజూ శాంసన్ కు కూడా ఛాన్స్ ఇచ్చారు సెలక్టర్లు. సంజూ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో వాంఖెడే వేదికగా జరిగిన తొలి టీ20లో గాయపడి టీమ్ కు దూరమయ్యాడు. ఓపెనర్ గా గిల్ తో జైస్వాల్ లేదా ఇషాన్ లలో ఎవర్ని ఆడిస్తారో మరి..
బ్యాటర్లుగా గిల్, జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లను ఎంపిక చేయగా.. ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కొనసాగనున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లలో ఆడిన బౌలర్ శివమ్ మావిని పట్టించుకోని సెలక్టర్లు అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ తో అవేశ్ కాన్, ముఖేశ్ కుమార్ లకు కూడా చోటిచ్చారు.
స్పిన్నర్లు కుల్చా (కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్) తో పాటు రాజస్తాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను కూడా ఎంపిక చేయడం గమనార్హం. అయితే ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 తో పాటు దేశవాళీలో కూడా నిలకడగా ఆడుతున్న హిట్టర్ రింకూ సింగ్ ను మాత్రం సెలక్టర్లు పక్కనబెట్టడం గమనార్హం.
టీ20లకు భారత జట్టు : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్
ఇండియా - వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ :
- ఆగస్టు 3 : ఫస్ట్ టీ20 - ట్రినిడాడ్
- ఆగస్టు 6 - సెకండ్ టీ20 - గయానా
- ఆగస్టు 8 : థర్డ్ టీ20 - గయానా
- ఆగస్టు 12 : ఫోర్త్ టీ20 - ఫ్లోరిడా (అమెరికా)
- ఆగస్టు 13 : ఫిఫ్త్ టీ20 - ఫ్లోరిడా
(మొదటి మూడు మ్యాచ్ లు కరేబియన్ దీవుల్లో జరుగునుండగా చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలో జరుగుతాయి)