IND vs WI, Andy Roberts:
వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ (Andy Roberts) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందన్నాడు. ఆ జట్టులో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్, ఐదు లేదా నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్లే కనిపించలేదని పేర్కొన్నాడు. కపిల్ డెవిల్స్ తమను చిత్తుగా ఏమీ ఓడించలేదని వెల్లడించాడు. ప్రస్తుతం రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీసు కోసం భారత్ కరీబియన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఒకప్పుడు కరీబియన్ క్రికెట్ టీమ్ అంటేనే ప్రపంచం వణికిపోయేది. భీకరమైన బ్యాటర్లు, దుర్భేద్యమైన పేసర్లు వారి సొంతం. ఆ జట్టు పర్యటనకు వస్తుందంటేనే ప్రత్యర్థి సగం చచ్చిపోయేది. అందుకే 1975, 1979లో వరుసగా వన్డే ప్రపంచకప్‌లను సొంతం చేసుకుంది. అయితే 1983లో మాత్రం పసికూనలైన కపిల్ డెవిల్స్ చేతులో దారుణ పరాభవం ఎదుర్కొంది. లీగు, ఫైనల్ మ్యాచుల్లో టీమ్‌ఇండియా చేతిలో ఓటమి పాలైంది.
1983 ఫైనల్లో టీమ్‌ఇండియాలో ఎవరూ తనను ఆకట్టుకోలేదని ఆండీ రాబర్ట్స్ అంటున్నాడు. 'మేం మంచి ఫామ్‌లో ఉన్నాం. కానీ ఆ మ్యాచులో బాగా ఆడలేదు. 1983లో టీమ్‌ఇండియాను అదృష్టం వరించింది. మాది గొప్ప జట్టే అయినా ఆ ప్రపంచకప్‌లో రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. ఆ రెండూ భారత్ చేతిలోనే. ప్రపంచకప్ ముగిశాక ఆరు నెలల్లోనే మేం భారత్‌లో పర్యటించాం. ఆతిథ్య జట్టును 6-0తో క్లీన్‌స్వీప్ చేశాం. దానర్థం మేం ఫైనల్లో మాత్రమే బాగా ఆడలేదని. 183 పరుగులకే ఆలౌటైనా అదృష్టం వారిపైపే ఉంది. మేం కేవలం ఒక్క మ్యాచే ఓడిపోయాం. మేమీ అతి ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేదు' అని రాబర్ట్స్ అన్నాడు.
'టీమ్‌ఇండియా బ్యాటర్లలో ఎవ్వరూ నన్ను ఆకట్టుకోలేదు. ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేదు. ఇక బౌలర్లలో నాలుగు, ఐదు వికెట్లు తీసినోళ్లే లేరు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడితేనే బ్యాటర్లు ఆకట్టుకుంటారు. టీమ్‌ఇండియాలో ఎవరూ ఆ పని చేయలేదు. వివ్ రిచర్డ్స్ ఔటవ్వడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మేం పుంజుకోలేదు. 1975, 1979 ఫైనళ్లకు టీమ్‌ఇండియాతో మ్యాచుకు తేడా మేం మొదట బౌలింగ్ చేయడమే. అదే దెబ్బకొట్టింది' అని రాబర్ట్స్ అన్నాడు.
ఏదేమైనా 1983 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియ అద్భుతమే చేసింది. భీకరమైన వెస్టిండీస్‌పై 183 పరుగులే చేసినా టార్గెట్ కాపాడుకుంది. కృష్ణమాచారి శ్రీకాంత్ 57 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సందీప్ పాటిల్ (27), అమర్‌నాథ్ (26) ఆకట్టుకున్నారు. ఇక ఛేదనకు దిగిన విండీస్ 43 పరుగుల తేడాతో ఓడింది. అమర్‌నాథ్, మదన్ లాల్ తలో మూడు వికెట్లు పడగొట్టి కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.
ప్రస్తుతం టీమ్‌ఇండియా కరీబియన్ పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 జట్లను సెలక్టర్లు ప్రకటించారు. బుధవారం రాత్రి ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేశారు. పూర్తిగా యువకులకే పగ్గాలు అప్పగించారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటిచ్చారు.
టీ20లకు భారత జట్టు : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్