Telangana CM Revanth Reddy Shared Praja Bhavan Video: తెలంగాణ ప్రజా భవన్(Jyotiraopule Prajabhavan ) తొలిరోజు జనాలతో కళకళలాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి తమ కష్టాలు చెప్పుకోడానికి ఉదయాన్నే ప్రజలు ప్రజా భవన్ ముందు క్యూ కట్టారు. అక్కడ పోలీసులు తోపులాట జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి(Telangana CM )గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. ప్రజా భవన్ లో మీకోసం గేట్లు తెరుచుకుని ఉంటాయి వచ్చేయండి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో ఈరోజు ప్రజలు తమ అర్జీలు తీసుకుని ప్రజా భవన్ కి వచ్చారు. ప్రజా దర్బార్ లో వారు సీఎంకు తమ అర్జీలు ఇవ్వబోతున్నారు. 






ఎన్నికల హామీ..
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారికంగా ప్రకటించినా.. రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రత్యేక హామీలతో ఆకట్టుకున్నారు. దివ్యాంగురాలు రజినికి తొలి ఉద్యోగం ఇస్తానన్నారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇక ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మారుస్తానని ఎన్నికలకు ముందే ఆయన ప్రకటించారు. ఆ మాట ప్రకారమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజా భవన్ కు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ గా ఉన్నన్ని రోజులు ఆ భవనం ముందు ఉన్న ఇనుప గేట్లను తాము తొలగించామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ గేట్లు తొలగించడం, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయాన్నే అర్జీలతో ప్రజా భవన్ కు తరలి వచ్చారు కొంతమంది. 


పరిష్కారం ఎలా..?
ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ప్రజల సమస్యలు కొన్ని అపరిష్కృతంగానే మిగిలి ఉంటాయి. గతంలో చంద్రబాబు కూడా వారానికోసారి ఇలా అర్జీలు స్వీకరించేవారు. సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక స్పందన పేరుతో ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రతి సోమవారం ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలను చెప్పుకుంటారు. వీటికి తోడు నెలలో ఒకరోజు స్పెషల్ గ్రీవెన్స్ అంటూ జిల్లా కలెక్టర్లే గ్రామాలకు తరలి వచ్చి ప్రజల సమస్యలు వినేవారు. ఆ తర్వాత జగనన్నకు చెబుదామంటూ మరో కార్యక్రమం తెరపైకి వచ్చింది. ఇంత జరిగినా, ఇన్ని చేస్తున్నా కూడా.. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో అర్జీదారులు కిటకిటలాడుతుంటారు. సమస్యలు ఎక్కువ, పరిష్కారాలు తక్కువ.. అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు పరిష్కారం ఎలా చూపిస్తారో చూడాలి. 


ప్రజా భవన్ లో వారానికోసారి ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశముంది. ప్రతి శుక్రవారం ప్రజలకోసం ప్రజా భవన్ తెరిచే ఉంటుంది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారి అర్జీలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మిగతా రోజుల్లో అధికారులు వాటిని స్వీకరించి పరిష్కారం సూచించే అవకాశముంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అందుబాటులో లేని రోజుల్లో సీఎస్, లేదా ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది. 


అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభిస్తారు. తాము స్వీకరించిన ప్రతి అర్జీకి న్యాయం చేయాలని, ప్రతి బాధితుడికి సంతోషంగా ఇంటికి పంపించాలని అనుకుంటారు. అయితే ఇది అనుకున్నంత సులభం కాదని మాత్రం ముందు ముందు తెలుస్తుంది. గతంలో చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు రిపీటయ్యాయి. ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు మాత్రం కొన్ని అపరిష్కృతంగానే ఉంటాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమస్యల పరిష్కారం కోసం నూతన విధానంతో ముందుకొస్తారని అంటున్నారు. ప్రతి అర్జీని లెక్కగట్టి.. సకాలంలో వాటిని పరిష్కరించే మార్గం వెదుకుతారేమో చూడాలి. 


సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం ప్రజా భవన్ గా పేరు మార్చినా ప్రయోజనం లేదని అనుకోవాల్సిందే. నిజంగానే ప్రజల సమస్యలు పరిష్కారమవుతుంటే మాత్రం ప్రజా భవన్ కి సార్థకత లభిస్తుంది. ప్రజా దర్బార్ నిర్వహించడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టు ప్రజల్లో బలమైన ముద్ర పడుతుంది.