తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2022-23  ఆర్థిక సంవత్సరానికి ఇటీవలే చార్జీల పెంపు ప్రతిపాదనలను  విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు సమర్పించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ - వ్యయాల వ్యత్యాసం  ఆ సంస్థలపై ప్రభావం చూపుతుందని ఈ లోటు పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించింది. అదే సమయంలో  విద్యుత్ సంస్థలు మనుగడ కొనసాగించాలంటే  ఈ ఆదాయ - వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది.  ధరలు సవరించాల్సిందని విద్యుత్ సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ అంశంపైనే ప్రధానంగా సమీక్షలో చర్చించారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. 


Also Read: ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్‌మెంట్‌కు పీఆర్సీ సిఫార్సు.. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం !



తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగం  వెలుగులు నింపుతోందని ప్రభుత్వం ప్రకటించింది.  2014 లో తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన నాటికి  కాంట్రాక్టడ్ కెపాసిటీ 7778 మెగావాట్లు మాత్రమే. ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,623 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచగలిగామని సమీక్షలో అధికారులు తెలిపారు.  ఈ ఏడేళ్లలో  రాష్ట్ర అవసరాలకు తగిన రీతిలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టీకరణ కోసం  33,722 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.  విద్యుత్ పీక్ డిమాండ్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా, నేడు 13,688 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని సమీక్షలో అధికారులు తెలిపారు.   2014 లో పీక్ డిమాండ్ కు 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉన్న స్థితి నుంచి  పీక్ డిమాండ్ సమయంలో 13,668 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకోవడం విద్యుత్ శాఖ సాధించిన గొప్ప ప్రగతిగా చెప్పారు. 




Also Read: న్యాయవ్యవస్థపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు అసహనం... మానవ హక్కులపై విశాఖ వెళ్లి సినిమా తీయించాలని సలహా !


2014 లో  కోటి 11 లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయగా, నేడు కోటి 68 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను  సరఫరా చేయడం జరుగుతోంది.  రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు కాగా, 2021 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 2012 యూనిట్ల కు పెరిగింది. దేశ తలసరి విద్యుత్ వినియోగం 1161 యూనిట్లు మాత్రమే. దేశ తలసరి వినియోగంతో పోల్చితే తెలంగాణ రెట్టింపు  స్థాయిలో ఉండటం విద్యుత్ శాఖ అభివృద్ధి సాధించిందన్నారు.


 విద్యుత్ పంపిణీ కోసం పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు, ట్రాన్స్ పార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున బోర్లు, బావుల ద్వారానే ఎక్కువ వ్యవసాయం  జరుగుతుందన్న విషయం తెలిసిందే.  అయితే  రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు  ఉండేవి. ఈ ఏడేళ్లలో 6 లక్షల 89 వేల కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు 25 లక్షల 92 వేల కనెక్షన్లు  ఉన్నాయి. వీటన్నింటికి 24 గంటల  ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతోంది. దేశంలో మరే రాష్ట్రం ఇలా ఉచితవిద్యుత్ 24 గంటలు ఇవ్వడం లేదన్నారు.  విద్యుత్‌ శాఖపై హరీష్‌రావు సమీక్ష చేయాలని కేసీఆర్ ఆదేశించడం  ఆ శాఖ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. 



Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి