Ponnam Prbhakar: ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రైవేట్ రంగ సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పెడతామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ప్రజలను చైతన్యం చేసేలా కాంగ్రెస్ కార్యక్రమాలు, పోరాటాలు ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో "స్థానికులకే ఉద్యోగాలు" అనే నినాదంతో పని చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పరిస్థితులు లేవని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల నోరు నొక్కేసిన పరిస్థితిని చూశామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. కానీ ఉద్యమం నినాదంగా ఉన్న స్థానికులకే ఉద్యోగాల అంశాన్ని.. కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఇదే విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన సంస్థల్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు ఉన్నాయో కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ వచ్చాక ప్రజలు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో యువతను మద్యం, గంజాయికి అలవాటు పడేలా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం యువతను తాగుబోతులుగా, క్రిమినల్స్ గా తయారు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలు పోరాటం చేయక పోతే యువత నిర్వీర్యం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు.
శ్రమదోపిడీ చేసే మల్లారెడ్డి కార్మిక మంత్రి - పొన్నం ప్రభాకర్
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవని., రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, మేధావులు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు భయపడేవని... కానీ కేసీఆర్ సర్కార్ నిస్సిగ్గుగా చట్టాలను అమలు చేయం అని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గతంలో కార్మికుల పక్షాన పోరాడే వారు కార్మిక మంత్రులుగా ఉండేవారని... ఇప్పుడు రాష్ట్రంలో శ్రమ దోపిడీ చేసే మల్లా రెడ్డి కార్మిక మంత్రిగా ఉన్నారంటూ ఆరోపించారు. కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వివరించారు.
పాలనను వెనక్కి తిరిగి చూసుకోవాలి..
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్, ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైందని సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర మంత్రులను పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని సీఎం కేసీఆర్ కు సూచించారు పొన్నం. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినం. కానీ టీఆర్ఎస్ పాలనలో త్రీడి షో తప్పా ఏమి లేదని ఎద్దేవా చేశారు. కొత్త బిచ్చగాళ్లలా టీఆర్ఎస్, బీజేపీ నేతలు కొట్లాడుకుంటున్నారని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫొటోలు లేవంటే మా ఫొటోలు లేవని కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు సలహా ఇచ్చారు.