Nizamabad Model Schools : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదర్శ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడం, హాస్టళ్ల నిర్వహణ అస్థవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 16 ఆదర్శ పాఠశాలలున్నాయి. 6 నుంచి 10 వరకు ఒక్కో తరగతికి వంద చొప్పున ఒక్కో స్కూల్‌లో 500 మంది, ఇంటర్మీడియట్‌ నాలుగు గ్రూపులకు  320 మంది వరకు విద్యార్థులు ఉంటారు.


పదోన్నతుల కోసం ఎదురుచూపులు 


తొమ్మిదేళ్ల క్రితం నియమితులైన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. ఫలితంగా ట్రెయిన్‌ గ్రాడ్యూయేట్‌ టీచర్లు, పోస్టు గ్రాడ్యూయేట్‌ టీచర్లుగా అర్హులైన పీజీటీలు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందలేకపోతున్నారు. ఏళ్లుగా ఒకేచోట పనిచేయడంతో అనాసక్తితో పాటు అజమాయిషీ కొరవడుతుందని ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం లేదని, ఉపాధ్యాయుల సర్వీసులో ఉండగా మరణిస్తే అర్హులైన కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద బోధనేతర కొలువు ఇస్తారు. ఈ నిబంధన కూడా తమకు వర్తించడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


హెచ్‌బీటీ, ఫిజికల్‌ డైరక్లర్ల గోడు వినేదెవరు? 


మోడల్‌ స్కూళ్లలో పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకపోవడంతో కొన్నేళ్లుగా హవర్లి బెస్ట్‌ టీచర్లతో బోధన చేయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వరకు హెచ్‌బీ టీచర్లు ఉండగా, ఏటా వేసవి సెలవులు రాగానే వారిని తీసివేయడం పాఠశాలల పునఃప్రారంభం రోజు రీ ఎంగేజ్‌ చేయడం ఆనవాయితీగా నడుస్తోంది. మూడేళ్లుగా హెచ్‌బీ టీచర్లను రీఎంగేజ్‌ చేసుకోవడంలో నిర్లక్ష్యం వల్ల తరగతుల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలిగి ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో వెంట వెంటనే రీ ఎంగేజ్‌ చేసుకుంటున్నా ప్రభుత్వం హెచ్‌బీ టీచర్లపై సవతితల్లి ప్రేమ చూపడంపై వాపోతున్నారు. ఒక్కో స్కూల్‌లో 800-1000 మంది విద్యార్థులు ఉండగా, ఒకే ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ విధులు నిర్వహించడం కత్తిమీద సాములా తయారైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 స్కూళ్లలో 16 మంది వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. వెయ్యి మందికి ఒక్కరు ఎలా వ్యాయామ విద్య అందిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 హాస్టళ్ల నిర్వహణతో సతమతం


ఒక్కో స్కూల్‌లో 800-1000 మంది విద్యార్థులు ఉంటే వారిలో 60 శాతం వరకు విద్యార్థినులే. ప్రస్తుతం హాస్టల్‌ సదుపాయం ఉన్నచోట 100 మంది బాలికలకే వసతి కల్పిస్తున్నారు. మిగిలిన వారు ఇతర హాస్టళ్లు, ఇళ్ల నుంచి సైకిళ్లు, ఆటోలు, బస్సుల్లో స్కూల్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఒక్కో పాఠశాల ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయించింది. ఆ స్థలంలో విద్యాలయాలు నెలకొల్పిన వసతి గృహాలను నిర్మించలేదు. మరికొన్నిచోట్ల వసతి గృహాలు ఏర్పాటు చేసినా వాటిని మాత్రం వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని అనేక పాఠశాలల్లో నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలల నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.