Gali Janardhan Reddy Case :  మైనింగ్ డాన్‌గా ప్రసిద్ధి చెందిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కేసును హైదరాబాద్‌ సీబీఐ కోర్టు తక్షణం విచారణ ప్రారంభించాలని. ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ నిబంధనలు సడలించాలని గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. నెల రోజులు మాత్రమే బళ్ళారి  లో ఉండేందుకు గాలికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది ఈ పిటిషన్‌పై విచారణలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 


అక్రమ మైనింగ్‌ చేశారని కేసులు


ఓబుళాపురం మైనింగ్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్‌ను తవ్వేవారు. కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులను కూడా చెరిపేసి విచ్చలవిడిగా మైనింగ్ చేశారని.. అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. అయితే పన్నెండేళ్లుగా  ఈ కేసుల విచారణ ముందుకు సాగడంలేదు. గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణలో  న్యాయమూర్తులు ఈ అంశంపై ఆశ్చర్యం వ్యక్తం ేశారు.  12 ఏళ్ల క్రితం న‌మోదైన ఈ కేసులో ఇప్ప‌టిదాకా కోర్టు‌లో ట్ర‌య‌ల్ జ‌‌ర‌గక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర అభియోగాలున్న ఇలాంటి కేసుల ట్ర‌య‌ల్‌లో జాప్యం అంటే న్యాయాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని కూడా కోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.


12 ఏళ్ల నుంచి ముందుకు సాగని విచారణ


2009 నుంచి  గాలి జనార్ద‌న్ రెడ్డిపై సీబీఐ న‌మోదు చేసిన గ‌నుల అక్ర‌మ తవ్వ‌కాల కేసు ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయిన తర్వాత దాదాపుగా ఇరవై నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు  బెయిల్ వచ్చింది. అయితే కేసుల విచారణ ముందుకు సాగకుండా అదే పనిగా అడ్డం పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుల్లో ఉన్న నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిస్చార్జ్ పిటిషన్లు వేయడం.. వాయిదాలు కోరడం వంటివి చేస్తూండటంతో విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


బెయిల్‌ కోసం జడ్జికే లంచం ఇచ్చిన మరో కేసు కూడా ..!


ఈ కేసుల్లో సీబీఐ అరెస్ట్ చేసిన సమయంలో బెయిల్ కోసం ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి , ఆయన సోదరులు పట్టుబడ్డారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కూడా సీబీఐ ట్రాప్ చేసింది. ఈ కేసు కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు కూడా విచారణలో ఉంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఆరు నెలల్లో ఈ కేసులన్నీ తేలిపోయే అవకాశం ఉంది. వీఐపీల కేసులు సుదీర్ఘ కాలం విచారణలు జరగకుండా ఉండటం.. వారు యధేచ్చగా పాత వ్యవహారాలు చేస్తూండటంపై కోర్టుల్లో పలు రకాల పిటిషన్లు పడ్డాయి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అలాంటి హైప్రోఫైల్ కేసులన్నీ త్వరగా తేలిపోయే అవకాశం ఉంది.