రెండు రోజుల ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ను అడుగడునా అడ్డుకుంటున్నది ఎవరు ? ఎందుకోసం ? . ధాన్యం కేంద్రం కొనాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం కొనాలని టీఎస్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యాసంగిలో వరి వేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పుడు చేతికొచ్చిన పంటను మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటను కొంటాం అని చెబుతుంది. కానీ రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచుతున్నారు. తేమ ఉందని, టోకెన్లు ఇచ్చాం ఇంకా మీ టైం రాలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అసలు వడ్లు అమ్మడానికే రైతులు రావడంలేదు. మరికొన్ని చోట్ల మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
Also Read : రంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు...
కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల బాధలు పరిశీలిస్తానని బండి సంజయ్ పర్యటనలు ప్రారంభించడంతోనే వివాదం ప్రారంభమయింది. గత వారం ప్రెస్ మీట్లతో ఒకరినొకరు విమర్శించుకున్న టీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొదటి రోజు టూర్‌లోనే బండి సంజయ్ కాన్వాయ్ లోని వాహనాలను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే అని బీజేపీ అంటోంది. కేసిఆర్, కేటిఆర్, మంత్రుల అదేశాల మేరకే తమపై పథకం ప్రకారం దాడి జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి గవర్నర్‌కే ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ మాత్రం దాడి చేస్తోంది రైతులేనని చెబుతోంది. తమ వద్దకు బీజేపీ నేతలు రావద్దని అంటున్నారని టీఆర్ఎఎ్ నేతలు అంటున్నారు. అయితే ధాన్యం అమ్మకోవాలని కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల వద్ద కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు ఉంటాయా? అనేది ప్రశ్న. మరోవైపు ఈ దాడి - ప్రతి దాడులకు కొనసాగింపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాము నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపితే బీజేపీ నేతలు రెచ్చగొట్టారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Also Read: కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..
అసలు ధాన్యం కొననంటోంది ఎవరు ? అనే క్లారిటికీ రైతులు వస్తున్నట్లు కన్పిస్తోంది. క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు వెళ్లి అసలు వానాకాలం పంటను ఎందుకు కొనడంలేదు అనే విషయాన్ని రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం రైతుల్లో చర్చ జరిగే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోది. అదే సమయంలో ప్రభుత్వానిది దళారి పాత్రనేనని పండించేది రైతులయితే కొనేది కేంద్రమని కూడా చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు యాసంగి పంట చేతికొచ్చిన తర్వాత బీజేపీ నేతలు వచ్చి పంట కొంటారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ అంశంపై అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఇటు కేంద్రంలో అధికారంలో బీజేపీ రైతుల్ని గందరగోళ పరిచి రాజకీయం చేస్తున్నాయి.