రోడ్డు నిబంధనలు మీరినందుకు మీ వాహనంపై చలానా పడిందా? అది చెల్లించకుండా అంతే రోడ్డుపైకి వస్తే వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందంటూ ఇటీవల విపరీతమైన ప్రచారం జరిగింది. ఓ లాయర్‌కు చెందిన బైక్‌ను ట్రాఫిక్ పోలీసు సీజ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త పాకిపోయింది. పెండింగ్ చలానాలు ఉండి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుకు పట్టుబడితే ఇక బండి సీజ్ చేయొచ్చని, అందుకే ఆ పోలీస్ జప్తు చేశాడని వీడియో వైరల్ అయింది. దీంతో పెండింగ్ చలానాలున్న వాహనదారులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్క పెండింగ్ చలానా ఉన్నా వాహనం జప్తు చేయొచ్చని ఓ ట్రాఫిక్ అధికారి చెప్పినట్లుగా వీడియో బయటికి రావడంతో భయం మరింత పెరిగింది. అయితే, దీనిపై తెలంగాణ హైకోర్టు ఇటీవల క్లారిటీ ఇచ్చింది. దీంతో వాహనాలను సీజ్ చేసే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది.
వాహనాలపై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నా సరే.. వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి బండిని పోలీసులు సీజ్ చేయగా.. అది సరికాదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏదైనా వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది.
Also Read: Medak Murder: ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆమె పాత్రపై పోలీసుల ఆరా..
ఆ ఘటనతో అందరిలోనూ ఆందోళన
కూకట్‌పల్లి కోర్టులో లాయర్‌గా ఉన్న వ్యక్తి ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్ ఉండడం వల్ల వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ పెండింగ్ చలానా అప్పుడే చెల్లించాలని కోరగా.. వాహనదారుడు అందుకు ఒప్పుకోకపోవడంతో సీజ్ చేశారు. ఒక్క చలానాకే సీజ్ చేస్తారా అంటూ న్యాయవాది ప్రశ్నించారు. అయితే, తాము నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బాధితుడు న్యాయవాది కావడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగస్టు 11న ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం పెండింగ్ చలానాల నెపంతో వాహనాలను సీజ్ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని కోర్టు ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలతో వాహనదారులకు ఊరట కలిగినట్లయింది.
Also Read: Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్