Police Force At MLA Arikepudi Gandhi House: ఇటీవల ఉద్రిక్తతల క్రమంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 200 మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన సిబ్బంది.. గాంధీ ఇంటివైపు రాకపోకలు నిలిపేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించగా.. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లగా.. అక్కడ రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అటు, తన ఇంటిపై జరిగిన దాడిని కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సహా ఇతర నేతలు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఇళ్లకు వస్తాం అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోగా పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు గాంధీ ఇంటి వద్ద భారీగా మోహరించినట్లు తెలుస్తోంది.


మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి యత్నం


మరోవైపు, తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. జీవో నెం. 33 రద్దు చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరగా.. తెలంగాణ భవన్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరగ్గా.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవో 33 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోతో నష్టం జరుగుతుందని.. స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.


Also Read: KTR: అతి తెలివి మంత్రిగారూ.. మీ చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా? కాంగ్రెస్‌లోనా? - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్