రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇందారం 1కే౼1ఏ సింగరేణి మైన్ ఉంది. ఈనెల 16వ తారీఖున ఉదయం ఏడు గంటల సమయంలో మైన్ క్యాంటీన్ బయటవైపు మంగిలాల్ పేరుతో మావోయిస్టుల హెచ్చరిక అనే వాల్ పోస్టర్ కనిపించింది. పోస్టర్ పై.. ఉన్న వివరాలను పరిశీలిస్తే.. కొందరు అధికారులు, కార్మికులకు వార్నింగ్ ఇస్తున్నట్లు గా పేర్కొన్నారు. దీంతో మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ మహమ్మద్ గౌస్ పాషా జైపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ రామకృష్ణ.. కేసు విచారణ మెుదలు పెట్టారు. అసలు వాల్ పోస్టర్ వేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ? అంటూ ఆరా తీశారు. అది నిజంగా మావోయిస్టులు వేసిందా లేక వ్యక్తిగత కక్షలతో అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అక్కడ దొరికిన ఓ గమ్ బాటిల్ క్యాప్ మొత్తం కేసును చేధించింది. వాల్ పోస్టర్ దగ్గర క్యాప్ లేకుండా గమ్ బాటిల్ దొరికింది పోలీసులకు. అయితే మైన్ బ్యారక్ లో నిందితుడి బాక్స్ వద్ద.. గమ్ బాటిల్ క్యాప్ దొరికింది. గమ్ బాటిల్ ఓ దగ్గర, క్యాప్ ఇంకో దగ్గర ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. నిందితుడిని గట్టిగా విచారించగా అసలు విషయం బయటపడింది.
ప్రధాన నిందితుడైన దండే మల్లేష్ అనే పంపు ఆపరేటర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. తన తోటి కార్మికుడైన రాధాకృష్ణతో తనకి గొడవ జరిగిందని దీంతో మిగతా కార్మికులు సైతం రాధాకృష్ణకు మద్దతుగా నిలిచారు. కార్మికులను బెదిరించాలని భావించిన మల్లేష్ ఓ స్కెచ్ వేశాడు. తనతోపాటు మేషన్ వర్క్ చేసే తిలక్ నగర్ కు చెందిన బడికల ఐలయ్య సహాయంతో ఈనెల 15వ తేదీన గోదావరిఖని 2 ఇంక్లైన్ కాలనీ నుంచి ఇసుక బంకర్ కి వెళ్లే అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో హెచ్చరిక పోస్టర్ రాశారు.
రాత్రిపూట కార్మికులు ఎవరూ లేని సమయంలో క్యాంటీన్ వెనక ఉన్న గోడకు గమ్ తో అతికించి ఏమీ తెలియనట్టు డ్యూటీకి వెళ్ళిపోయారు. కానీ గమ్ బాటిల్ అక్కడే ఉంచి.. క్యాప్ ను మాత్రమే తీసుకెళ్లారు. తెల్లవారి ఇది చదివిన అధికారులు భయభ్రాంతులకు గురై ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు. ప్లాన్ వేసిన మల్లేష్, పోస్టర్ రాసిన అయిలయ్యను అరెస్టు చేశారు. మావోల పేరుతో వాల్ పోస్టర్లు రాసి బెదిరిస్తే వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి పీడీ యాక్టులు కూడా అమలు చేస్తామని జైపూర్ ఏసీపీ నరేందర్ హెచ్చరించారు.
Also Read: Sangareddy: పెళ్లి పందిరి నుంచి కట్నంతో వరుడు పరారీ ఘటన సుఖాంతం.. మళ్లీ అంత పని చేసేశారే..!
Also Read: TRS Party: తెలంగాణ వ్యాప్తంగా ‘చావు డప్పు’.. దిష్టి బొమ్మలు దహనం చేసిన టీఆర్ఎస్ నేతలు
Also Read: Road Accident: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం