తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. వారి వారి నియోజకవర్గాలు, ప్రాంతాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నిరసనలు చేశారు. ‘ఊరూరా చావు డప్పు’ పేరుతో అంతా ఏకకాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరు సహా.. తెలంగాణ బీజేపీని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


గజ్వేల్‌లో చేపట్టిన నిరసనల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం బస్తా తలపై మోస్తూ నిరసన చేశారు. 


హుజూర్‌నగర్‌ మండలం శ్రీనివాసపురంలో రైతులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాల్చివేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు దగ్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో విజయవాడల జాతీయ రహదారిపై చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జడ్పీటీసీ నిరటి రాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు రైతులు నర్కుడ చౌరస్తా లో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు టీఆర్ఎస్ శ్రేణులు. నిర్మల్ జిల్లా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి మంచిర్యాల చౌరస్తా వరకు టిఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, కేంద్రం ప్రభుత్వ దిష్టి బొమ్మ‌ల‌ను మంత్రి దగ్ధం చేశారు.


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!


అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్, మరిపెడ, కురవి, మండలాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా శవ యాత్ర, దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పాల్గొన్నారు. జిల్లాలోని నర్సింహుల పేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర చేశారు.


కిషన్ రెడ్డి సూటిగా చెప్పాలి: హరీష్ రావు
ఆహార భద్రత బాధ్యత కేంద్రానిదేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. తమది గొంతెమ్మ కోరిక కానేకాదని.. బీజేపీ నేతలవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్‌ ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రూపేణా రూ.50 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కిషన్‌రెడ్డి యాసంగి వడ్లను కొంటారా లేదో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. 


Also Read:  కొడుకును ఖననం చేసిన మరుసటిరోజే ఉరేసుకున్న తండ్రి.. సమాధి వద్దనే అఘాయిత్యం


Also Read:  చిత్తూరు జిల్లాలో విషాదం... స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి