ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుమారుడిపై తండ్రికి ఉన్న ప్రేమ ఎంతగా ఉందో ఈ ఘటన చాటుతోంది. పురుగుల మందు తాగి కుమారుడు ఆత్మహత్య చేసుకోగా.. అతని మరణం తట్టుకోలేని తండ్రి భరించలేక తనువు చాలించాడు. తన కుమారుడిని ఖననం చేసిన చోటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒకే రోజు వ్యవధిలో ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో కోలుకోలేని విషాదం నెలకొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది.


స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. ఈ నెల 15న కుమారుడు సాయి భాను ప్రకాశ్‌ అనే 15 ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, అతని తండ్రి ఈ ఉదయం ప్రాణాలు తీసుకున్నాడు. రాంబాబు కుటుంబం ఖమ్మం నగరంలో నివాసం ఉంటోంది. అక్కడే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో సాయి ప్రకాశ్ పదవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న సాయి భాను ప్రకాశ్ తన స్నేహితులతో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలు జరిపిన తీరుపై సాయిని స్కూలు ప్రిన్సిపల్, తల్లిదండ్రులు బాగా తిట్టారు. నిబంధనలు మీరినందుకు గానూ పాఠశాల యాజమాన్యం సాయి ప్రకాశ్‌ను వారం రోజుల పాటు స్కూలుకు రావొద్దని సస్పెండ్‌ చేసింది.


దీంతో ఇంట్లోనూ మందలించారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16వ తేదీన సాయి మృతి చెందాడు. స్వగ్రామం సత్తుపల్లిలో కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తయిన అనంతరం.. రాంబాబు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. అయినా అతని జాడ దొరకలేదు. కుమారుడిని ఖననం చేసిన చోటుకు వెళ్లి చూడగా.. చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో సత్తుపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Also Read: చోరీ కేసుపై సీపీ ప్రెస్ మీట్.. పోలీసులు, విలేకరుల ముందే నిందితుడు రచ్చ రచ్చ, భార్య గురించి గట్టిగా అరుస్తూ..


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి