హైదరాబాద్‌లో ఓ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసు గురించి సీపీ అంజనీ కుమార్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియాకు తెలుపుతున్న సమయంలో వెనక వైపు నిందితులు నిల్చొని ఉన్నారు. ఆ సమయంలో ప్రధాన నిందితుడు సీపీ చెప్పిన మాటలను ఖండిస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఈ దొంగతనం కేసులో తన భార్యకు ఏ సంబంధం లేదని నానా బీభత్సం చేశాడు. ‘తన భార్య చోరీ చేయలేదని, ఆమెను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని’ గట్టి గట్టిగా అరుస్తూ వాగ్వాదం చేశాడు. చివరికి అతణ్ని పోలీసులు మరో గదిలోకి తీసుకెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి సీపీ వివరాలు వెల్లడించారు.


ఏం జరిగిందంటే..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది అక్టోబర్‌ 21న ఓ దొంగతనం ఘటన చోటు చేసుకుంది. సుమారు 70 తులాల బంగారం దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ నగర పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడు ముంబయికి చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌ దావుద్‌ షేక్‌ అనే 33 ఏళ్ల వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 41 తులాల బంగారం ఆభరణాలు, బిస్కెట్లను రికవరీ చేశారు. 


జీహెచ్‌ఎంసీలో ల్యాండ్‌స్కేప్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి దోమల్‌గూడ గగన్‌ మహల్‌లోని స్వామి నిలయంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 21న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోని 70 తులాల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు దొంగతనానికి గురయ్యాయి. ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని గమనించిన వాచ్‌మెన్‌ మణికొండలో నివాసముంటున్న బాలకృష్ణ కూతురుకు ఫోన్‌ చేశాడు. దీంతో ఆమె చోరీ విషయాన్ని పోలీసులకు చెప్పింది.


దొంగలు వీరే..
కర్నూల్‌ జిల్లాకు చెందిన సుధాకర్‌ అనే 27 ఏళ్ల వ్యక్తి ఆయన భార్య నాగమణి 22 మెహదీపట్నంలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై 59 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటిదాకా 17 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఇతనికి మరో ఘరానా దొంగ బార్కాస్‌ నబీల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అయూబ్‌ అలియాస్‌ బడా అయూబ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతనిపై తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 120 కేసులు ఉన్నాయి. కేవలం పశువులను దొంగతనం చేసి అమ్ముకోవడం ఇతని పని. సుధాకర్, నాగమణి దంపతులు, అయూబ్ ముగ్గురు కలిసి చోరీ చేయాలని బాలకృష్ణ ఇంటిని టార్గెట్‌ చేశారు.


ఓ చోరీ కేసులో జైలులో ఉన్న సుధాకర్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 13న విడుదల అయ్యాడు. జైలు నుంచి బయటికొచ్చిన 8 రోజులకే 21వ తేదీన బాలకృష్ణ ఇంట్లో చోరీ చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుధాకర్, అయూబ్, నాగమణి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 41 తులాల ఆభరణాలను రికవరీ చేశారు. మిగిలిన 29 తులాల రికవరీ జరగాల్సి ఉందని తబ్రేజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వాళ్లను పట్టుకొని విచారిస్తే పూర్తి స్థాయిలో రికవరీ అవుతుందని సీపీ తెలిపారు. 



‘‘ఈ చోరీ కోసం ఎక్కడా సెల్‌ ఫోన్‌ వాడకుండా, చోరీ చేసిన బైక్‌ వాడి దొంగతనం చేశారు. సీసీటీవీ కెమెరాలకు కూడా ఎక్కడా దొరకకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. పక్కా అపార్ట్‌మెంట్‌ గోడ దూకి వారి గేటు ద్వారా వెళ్లారు. వేర్వేరు కోణాలు అన్వేషించి పోలీసులు మొత్తానికి కేసును చేధించారు.


Also Read: Warangal: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి