పెళ్లి పందిరి నుంచి కట్నం డబ్బుతో పారిపోయిన ఘటన గుర్తుందా? నాలుగు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది. కానీ, అలా శుభం కార్డు పడడం పెళ్లి కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన కూడా కలగజేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 


అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సింధూ రెడ్డికి, కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు అడ్వకేట్ అయిన మాణిక్‌ రెడ్డితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. అయితే, పెళ్లిలో ఇచ్చిన కట్నం డబ్బుతో వరుడు పరారవడం స్థానికంగానే కాక, సోషల్ మీడియాలోనూ కలకలం రేపింది. డిసెంబర్‌ 12న జరగాల్సిన పెళ్లి.. పీటలపైనే ఆగిపోయింది. అమ్మాయి తరపువారు ఇచ్చిన కట్నం డబ్బు రూ.25 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని.. పెళ్లికి గంట ముందు వరుడు పరారయ్యాడు. 


Also Read: Warangal: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!


ఈ క్రమంలో వధువు సింధూ రెడ్డి వరుడి తీరు, వారి కుటుంబంపై ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని రూరల్‌ పోలీస్‌ స్టేషన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకూడదని న్యాయ పోరాటం చేసింది. వెంటనే, ఇరు గ్రామాల పెద్దలు పెళ్లి కొడుకు తల్లిదండ్రులను కలిసి, వరుడు మాణిక్‌ రెడ్డిని వెతికి పట్టుకున్నారు. చివరికి వారితో మాట్లాడి.. పెద్దలు సంధి కుదిర్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డి పల్లి గ్రామంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిపించారు. 


అయితే, తనకు న్యాయం జరిగేలా కృషి చేసిన పెద్దలకు పెళ్లి కూతురు సింధూ రెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. అయితే, ఇక్కడే ఓ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వివాహం కాకముందే కట్నం డబ్బుతో వెళ్లిపోయినవాడు మళ్లీ అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని వేధించబోడని ఏంటి గ్యారంటీ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాంటి వ్యక్తితో దగ్గరుండి పెళ్లి చేయించడం పట్ల సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది.


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి