Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ సీపీ నేతలు, మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ నేతలు, మంత్రులు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావుకు సమాధానం చెప్పాల్సింది పోయి తెలంగాణ ప్రజలను వైఎస్ఆర్ సీపీ నేతలు తిట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఓ వీడియోను ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. 






"తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైఎస్ఆర్ సీపీ నాయకులు.. స్పందనకు ప్రతిస్పందన, విమర్శకు ప్రతి విమర్శ.. ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడడం కొంచెం ఇబ్బంది కరంగా మారింది. పాలకులు వేరు ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదు. తెలంగాణ నాయకులైనా, ఆంధ్ర నాయకులైనా సరే జనసేన నుంచి చెప్పేదేంటంటే.. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలను అనడం సరికాదు. మొన్న మంత్రి హరీష్ రావు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ కాంటెక్స్ట్ లో అన్నారో మరి.


కానీ దీనిపై వైఎస్ఆర్ సీపీ నేతలు, మంత్రులు స్పందిస్తున్న తీరు బాగాలేదు. తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం.. నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపాన్ని కల్గించింది. దయచేసి వైఎస్ఆర్ సీపీ నాయకులందరికీ విన్నపం. నోర్లను కాస్త అదుపులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే.. వ్యాఖ్యలు చేసిన మంత్రినిగాని, వ్యక్తినిగాని అనాలి. దీంట్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాగకండి." - జనసేన అధినేత పవణ్ కల్యాణ్