YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా సీబీఐ చేర్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నాలుగు సార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భఆస్కర్ రెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్ లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగగా భాస్కర రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు. హత్య తర్వాత సహనిందితులు డి శివశంకర్ రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది. 


ఇప్పటి వరకు జరిగిన సీబీఐ విచారణల్లో అనుమానితుడిగానే సీబీఐ పరిగణించింది. కానీ, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన్ను సీబీఐ జడ్జి ముందు ప్రవేశ పెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు. 3 గంటల సమయంలో హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరు అయ్యేందుకు అవినాష్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 


అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి


అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి. సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందులలోని తన నివాసం నుంచి నేడు తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఏకంగా 10 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. వీరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే అవినాష్ ను జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో సీబీఐ విచారణ చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో తరహాలోనే వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు. నిన్ననే (ఏప్రిల్ 16) తండ్రి భాస్కర్ రెడ్డిని వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేడు కుమారుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. వివేక హత్య కేసు విచారణలో సీబీఐ శుక్రవారం అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ ను అరెస్టు చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలు వెల్లడించింది.