పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ... పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. రేపటి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను మోడీ గుర్తుచేసుకున్నారు. ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నామని, స్వాతంత్రానికి పూర్వం ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేదన్నారు. ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైందని, అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాలు ఈ భవనంలోనే జరిగాయన్నారు మోడీ. 


ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.  1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో...ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది.  దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడం, హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోయి...ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వంటి నిర్ణయాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరిగాయి. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు. 


ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం 2009 నవంబర్ 27న అమరణ దీక్షకు సిద్ధమయ్యారు కేసీఆర్. తరువాత కేసీఆర్ అరెస్ట్.. ఖమ్మం తరలింపు.. హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఎల్బీ నగర్ లో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న కేంద్రం ప్రకటించింది. తరువాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇలా 2014 వరకు వెళ్లింది. 


తెలంగాణ బిల్లుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశలో చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నాటి నుంచి జూన్ 2ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి విడిపోవడం, హైదరాబాద్ రాష్ట్రంలో కలవడం, మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు నిర్ణయాలన్న పాత పార్లమెంట్ భవనంలోనే జరిగాయి. 


రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఆందోళనకు దిగడంతో...పార్లమెంటు పరిసరాల్లో అసాధారణ భద్రత కల్పించారు. మొయిన్‌ గేటును మూసివేశారు. దీంతో పార్లమెంటుకు సభ్యులు కాలినడకనే వెళ్లారు. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేశారు. అనంత‌రం మధ్యాహ్నం 12.45 గంటల తరువాత సభ ప్రారంభమైంది. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెల్‌లోకి దూసుకు వెళ్లారు. బిల్లుకు వ్యతిరేకంగా సీసీఎం సభ్యులు తొలిసారిగా లోక్‌స‌భ‌లో నిర‌స‌న తెలిపారు. శివసేన, అన్నాడిఎంకె, ఇతర పార్టీల ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో మార్ష‌ల్ వారిని అదులోకి తీసుకొచ్చారు. దీంతో స‌భ‌ను మ‌ధ్య‌హ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేశారు.


సభ్యుల నిరసన, గందరగోళం మధ్యలోనే అప్పటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీ ప్ర‌తిప‌క్ష‌నేత సుష్మాస్వరాజ్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర విభ‌జ‌న బిల్లుపై 23 నిమిషాలు చ‌ర్చ జ‌రిగింది. అన‌ంత‌రం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, సీమాంధ్ర ఎంపీల ఆందోళనలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచింది పాత పార్లమెంట్ భవనం.