Amrita Sher-Gil: 1941లో 28 ఏళ్ల వయసులో మరణించిన సిక్కు - హంగేరియన్ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ గీసిన చిత్రం ‘ది స్టోరీ టెల్లర్’ (1937) శనివారం రాత్రి జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 61.8 కోట్లు ($7.4 మిలియన్లు) పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధర పలికిన భారతీయ కళగా నిలిచింది. వాస్తవానికి, ఆధునికవాది సయ్యద్ హైదర్ రజా 'గెస్టేషన్' అనే పెయింటింగ్ పుండోల్ వేలం హౌస్‌లో రూ. 51.7 కోట్లు పలికింది. దాని తరువాత 10 రోజులకు జరిగన వేలంలో అమృత్ షేర్ గీసిన చిత్రం రూ.61.8 కోట్లు పలికింది


దీంతో రజా గీసిన ‘గెస్టేషన్’ ఇప్పుడు రెండవ అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా మారింది. అబ్‌స్ట్రాక్షనిస్ట్ వాసుదేయో ఎస్ గైటోండే 2020 ధర రూ.32 కోట్లకు పలికి 3వ స్థానంలో ఉంది. తాజా వేలంతో షేర్‌గిల్‌‌ అందరికంటే పైస్థానంలో ఉన్నారు. భారతదేశంలో చాలా కాలం పాటు,  విజయవంతమైన ఏకైక మహిళా కళాకారిణిగా షేర్ గిల్ మిగిలిపోయారు. మార్చి 2006లో, షేర్-గిల్ ‘విలేజ్ గ్రూప్’ (1938), స్త్రీల సమూహం విచారకరమైన చిత్రం రూ. 6.9 కోట్లకు విక్రయించబడింది. ఆ సమయంలో అది రికార్డు సృష్టించింది. 


ఈ రికార్డు ధర కళాకారుడి అపారమైన నైపుణ్యానికి, శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనమని సాఫ్రోనార్ట్ CEO మరియు సహ వ్యవస్థాపకుడు దినేష్ వజిరాణి అన్నారు.  ఈ పని ఆమెలోని నిజాయితీ, కీలక సమయాల్లో సంక్షిప్త రచనకు నిదర్శనమన్నారు. షేర్ గిల్ చిత్రం బెంచ్‌మార్క్‌ను రూపొందించడంలో తామ ఒక పాత్ర పోషించిడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 


1913లో బుడాపెస్ట్‌లో సిక్కు తండ్రి, హంగేరియన్ తల్లికి జన్మించిన అమృత షేర్ గిల్, యూరప్, భారతదేశంలో నివసించారు. ఎలైట్ ఎకోల్ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్‌లో చదువుకున్నారు, అక్కడ పెయింటింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియన్‌గా ఆమె నిలిచారు. పారిస్ విద్యార్థి రోజుల్లో ఆమె చిత్రించిన నగ్న చిత్రాలు, ఆమె తన సోదరిని మోడల్‌గా ఉపయోగించుకున్న సందర్భాలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. 


ఆమె 25 సంవత్సరాల వయస్సులో పారిస్ నుంచి భారతదేశానికి మారారు. యూరోప్ పికాసో, మాటిస్సే, బ్రాక్, అనేక ఇతర వ్యక్తులకు చెందినది. భారతదేశం తనకు మాత్రమే చెందుతుందని 1938లో ధైర్యంగా ప్రకటించింది. 1934లో తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఆమె భారత్‌కు నివాసం ఏర్పరచుకోవడానికి కారణాలను వివరించారు. యూరోప్‌లో సుదీర్ఘ నివాసం భారతదేశంలోని కొత్త విషయాలను కనుగొనడానికి సహాయపడిందన్నారు. అజంతా నుంచి ఒక ఫ్రెస్కో, చిన్న శిల్పం పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని ఆమె పేర్కొన్నారు. 


ప్రపంచ రికార్డును నెలకొల్పిన పెయింటింగ్  ‘ది స్టోరీ టెల్లర్’ (1937), పహారీ, పారిసియన్ ప్రభావాలను విలక్షణమైన కళాత్మక భాషలో చూపించింది. ఆవుల సహవాసంలో తమ ఇంటి బయట విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీల సమూహాన్ని చిత్రీకరించారు. ఒకరు పాన్ తింటుంటే, మరొకరు చేతితో విసనకర్ర ఊపుతూ, మరికొందరు చాట్ చేస్తున్నారు. షేర్-గిల్ పెయింటింగ్స్‌లో  మహిళలు ఆధిపత్యం చెలాయిస్తారు.  షేర్ గిల్ చిత్రాలు స్త్రీల సారాంశాన్ని తెలియజేసేవి అని క్యూరేటర్, విమర్శకురాలు యశోధర దాల్మియా జీవిత చరిత్రలో రాశారు.