ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్‌్ సమావేశాల కాల వ్యవధి స్వల్పమే అయినా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది... ప్రవేశ పెట్టే బిల్లులు ఏంటనే చర్చ మొదలైంది. 


పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ.. పార్లమెంట్ సమావేశాలు స్వల్పమే అయినా ఇది చారిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానున్నాయి. ఈ సెషన్ చిన్నదే కానీ చాలా విలువైనది. ఈ సెషన్ చాలా ప్రత్యేకం. ఇది 75 ఏళ్ల ప్రయాణంలో కీలకం  కాబోతోంది. ఈ సెషన్ చాలా విధాలుగా ముఖ్యమైనది. ఎంపీలందరూ ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మోదీ. గత చెడును  వదిలేసి మంచితో కొత్త పార్లమెంటుకు రండి అంటూ ఎంపీలకు సూచించారు. 


G20 సమ్మిట్ సందర్భంగా గ్లోబల్ సౌత్ గొంతుగా మారినందుకు, ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు గర్విస్తున్నామన్నారు మోదీ. ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతాలన్నారు. మూన్ మిషన్ విజయవంతమైన తర్వాత మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందన్నారు. శివశక్తి పాయింట్ కొత్త ప్రేరణకు కేంద్రంగా మారిందని అభిప్రాయపడ్డారు.