Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 261 మంది మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఘోర ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, తీవ్ర గాయాల పాలు కావడం తనను కలిచి వేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోని వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని సూచించారు. 







రైలు ఢీకొని 261 మంది ప్రయాణికులు మృతి చెందగా.. వందాలది గాయపడిన ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు తన హృదయ పూర్వక సానుభూతి తెలిపారు. వారికి ఆ దేవుడు ఎంతో ధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నట్లు ప్రకటించారు. యాంటీ కొలిజన్ పరికరాలకు ఏమైందని, ఇది నిజంగా ఎప్పుడూ జరగకూడని విషాదం అంటూ ట్విట్టర్ వేధికగా రాసుకొచ్చారు. 






మరోవైపు 50 మంది వరకు తెలుగు ప్రజలు చనిపోయినట్టు అనుమానం


ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రోజు ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఈ రైలు ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వివరించారు. అలాగే రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.