TTD News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మందే భక్తులు ఉన్నారు. అయితే స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ రష్యన్ భక్తుడు తాజాగా తిరుమలకు వచ్చాడు. రూ.7.6 లక్షల విరాళాన్ని అందజేసి తన భక్తిని చాటుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు ఈ డబ్బును అందజేశాడు. అయితే టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి చెక్కును ఇచ్చారు. ఈ విరాళంలో ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.1.64 లక్షల రూపాయలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యాదాన, వేదపారాయణ, బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని ట్రస్టులకు.. ట్రస్టుకు లక్ష చొప్పున ఖర్చు పెట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారిపై భక్తిని చైన్ రూపంలో వెల్లడించిన మరో భక్తుడు
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాట్లంకి చెందిన సోనీ నానురామ్ దయరాం అనే భక్తుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చారు. అయితే వారికి శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిని.. వెరైటీగా చెప్పారు. ఆ భక్తులు వేసుకున్న చైన్ అందరూ ఆసక్తిగా తిలకించారు.
చైన్ ద్వారా భక్తి తెలియడం ఏంటి?
సోనీ నానురామ్ దయరాం వేసుకున్న బంగారు చైన్ పై తిరుమల శ్రీనివాసుడి ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మెడల్లో కూడా ప్రత్యేకమైన చైన్లు ఉన్నాయి. వెంకటేశ్వరుడి ప్రతిమతో పాటు, పద్మావతి అమ్మ వారు, అలివేమ మంగతాయారు అమ్మవారి లాకెట్లతో పాటు కళశం లాకెట్లను ధరించారు. వీరు బయటకు వచ్చిన సమయంలో భక్తులందరినీ వీరు చైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వామి వారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చాలా మంది భక్తులు వీరి మెడలో ఉన్న చైన్లను చూస్తూ.. ఇంత పెద్ద లాకెట్లు ఉంటాయా అంటూ తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు తిరుమలలో కొనసాగుతున్న జేష్టాభిషేకం
తిరుమలలో శుక్రవారం రోజు జేష్టాభిషేకం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కవచాలు తొలగిస్తారు. సంవత్సరం పొడవునా కవచాలతో దర్శనం ఇచ్చే స్వామివారు జేష్టాభిషేకం నాడు మాత్రమే సహజ సిద్ధంగా దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా వజ్ర, ముత్యాలు, బంగారు ఆభరణాలతో మూడు రోజుల పాటు దర్శనం ఇస్తారు. 1980 దశకంలో జేష్టాభిషేకాన్ని ప్రారంభించింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని 'అభిధేయక అభిషేకం' అని కూడా అంటారు.
రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగింపు
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పుర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా వజ్రాభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంత వరకు అంటే సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు. సంవత్సరంలో జేష్టాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 4 వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.