YS Sharmila On CM KCR: నిజామాబాద్ జిల్లాలో 13వ రోజు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాత్ర కొనసాగింది. నిజామాబాద్ నగరంలో.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే వైఎస్సార్ కి చాలా ఇష్టమని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు మరమత్తులు చేయించి 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. గుత్ప, అలీ సాగర్ ప్రాజెక్ట్ ల ద్వారా.. 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని తెలిపారు. ప్రాణహిత - చేవెళ్ల ద్వారా మరో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అనుకున్నారని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారని, ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలు నెలకొల్పారని వెల్లడించారు. నందిపేట సెజ్ ను వైఎస్సార్ తీసుకువచ్చిందేనని గుర్తు చేశారు.


నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం చేసేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. "400కేవీ సబ్ స్టేషన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్సార్ ఎంతో చేశారు. వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఆర్ చేసింది ఏంటి? మొత్తం చెరకు వ్యవసాయాన్ని నాశనం చేశారు. ఐటీ హబ్ హబ్ అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ జిల్లా నుంచి వేల మంది ఏడారి దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్ బాధితుల కోసం రూ. 500 కోట్ల నిధులు అన్నారు.. ఎన్‌ఆర్‌ఐ సెల్ అన్నారు.. ఏమయ్యింది..? నిజామాబాద్ పట్టణానికి ప్రతి ఏడాది రూ. 100 కోట్లు అన్నారు.. ఎన్ని ఇచ్చారు? ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎవరు? బిగాల గణేష్ గుప్త కాదు.. భూముల గణేష్ గుప్తా. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే జెండా పాతెయ్యడమే అంట కదా.. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడే స్వాహా.. పంచాయతీ చేయమని చెప్తే ఆ భూమి మొత్తం స్వాహా చేస్తున్నారు. కమీషన్లు లేకుండా ఏ పని చేయరట కదా.. ఈ ఎమ్మెల్యే స్వీట్ బాయ్ అని  పిలిపించుకుంటారట.. అలా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా..?" అని షర్మిల విమర్శలు గుప్పించారు.


నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసింది ఏమిటని షర్మిల ప్రశ్నించారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసమే చేశారని విమర్శించారు. నమ్మి ఓటేస్తే పసుపు బోర్డ్ తెచ్చారా అని నిలదీశారు. టీఆర్ఎస్ అయినా.. బీజేపీ అయినా అందరూ మోసగాళ్లేనని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 


నిజామాబాద్ బిడ్డలు గట్టోళ్లు


దొర బిడ్డ అయినా.. దొరసాని అయినా.. మాట తప్పితే కర్రు కాల్చి వాత పెడతాం అని నిరూపించారని షర్మిల అన్నారు. కేసీఅర్ బిడ్డను సైతం ఓడించారు అంటే మీరు సామాన్యులు కారని కొనియడారు. ఇప్పుడు కవిత లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో వారం పాటు మకాం వేశారని షర్మిల ఆరోపించారు. "బిడ్డ ఇక్కడ ఓడిపోయిందని, అల్లాడి పోయారు. వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ.. బిడ్డకు మాత్రం ఉద్యోగం వెంటనే ఇప్పించారు. బీజేపీ కోటలు బద్దలు కొడతాం..  మెడలు వంచుత అని చెప్పిన కేసీఅర్.. వారి కాళ్ళ వెళ్ళ మీద పడుతున్నారు. ఇక ఒక్క మునుగోడు ఎన్నికలకు మొత్తం ఎమ్మెల్యే లు అంతా దిగిపోయారు. నియోజక వర్గంలో సమస్యలు వస్తే పట్టింపు లేదు. కానీ ఓట్లు కొనుక్కొనేందుకు వెళ్ళారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుంటారట. ఇంతకు ముందు మీకు మునుగోడు కనిపించడం లేదా.. మునుగోడు ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.. మునుగోడు ఏమైనా ఆఫ్గన్ లో ఉందా.. లేక పక్క రాష్ట్రంలో ఉందా.. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే మీకు గుర్తుకు వచ్చిందా.. అధికార పార్టీ కొత్తగా దత్తత తీసుకోవడం ఏంటి.. ఇంతకు ముందు మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు" అని షర్మిల ప్రశ్నించారు. 


"ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం అప్పజెప్తారా.. మునుగోడు లో మద్యం ఏరులై పారుతోంది. మీరు దత్తత తీసుకుంటే మీ సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తారా.. లేక కాళేశ్వరం కమీషన్ లతో అభివృద్ధి చేస్తారా.. ఫీనిక్స్ కంపెనీ డబ్బులతో అభివృద్ధి చేస్తారా" అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.