న్యాక్ గుర్తింపు పొందడంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 2016 ఫిబ్రవరిలో అప్పటి ఇన్ఛార్జి వీసీ, ప్రస్తుత ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి, రిజిస్ట్రార్, ఇప్పటి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రోఫెసర్ లింబాద్రి హయాంలో న్యాక్ బీ గ్రేడ్ సాధించారు. ఐదేళ్ల కాలవ్యవధి గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. కరోనా పరిస్థితుల కారణంగా మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు కూడా ముగియడంతో గుర్తింపు కోసం నివేదిక సమర్పించారు. రెండోదశలో సెల్ఫ్ స్టడీ రిపోర్టును పంపించడంపై వర్సిటీ ఉన్నతాధికారులు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. 

 

మెరుగైన గ్రేడ్ సాధనకు దరఖాస్తు చేయడంతో సరిపోదు. పాలకమండలి సమావేశంలో సెల్ఫ్ స్టడీ రిపోర్టును ఆమోదించి న్యాక్ బృందాన్ని ఆహ్వానించాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో వర్సిటీ ప్రగతిని పరిశీలించి, ఇంకా అవసరమైన పురోగతి, మౌలిక సదుపాయాలను సూచిస్తుంది. అందుకు ఇప్పటి నుంచే వర్సిటీలోని చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు సమష్టిగా పని చేయాల్సి ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. 

 

2015లో న్యాక్ పీర్ కమిటీ లోపాలు గుర్తించి రిపోర్టు ఇచ్చింది. హాస్టళ్లు, ఉపాధి కల్పనకు దోహదపడే కొత్త కోర్సులు, పరిశోధనల్లో మెరుగైన రిజల్ట్.. ఇలా అనేక అంశాలు సూచించింది. ఆ లోటుపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్తేనే మెరుగైన గ్రేడ్ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. 'ఏ' గ్రేడ్ సాధిస్తే రూసా లాంటి గ్రాంట్ల నుంచి ఎక్కువ నిధులు వస్తాయి. ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధన, ప్రోత్సాహకాలు లభిస్తాయి. విద్యార్థులు జాతీయస్థాయి పోటీపరీక్షల్లో సత్తా చాటే అవకాశం ఉంటుంది. 

 

వర్సిటీలో భవనాలు, పరిశోధనలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సైన్స్ భవనం నిర్మాణంలో ఉంది. ఆడిటోరియం, వసతులతో కూడిన క్రీడా మైదానం లేదు. గ్రంథాలయంలో సరైన పుస్తకాలు, కంప్యూటర్లు లేవు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. సుమారు 70కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అంశాల్లో వర్సిటీ వెనుకంజలో ఉందనే విమర్శలున్నాయి. రెగ్యులర్ వీసీ వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. వీసీ రవీందర్ విద్యార్థుల సమస్యలపై పట్టించుకోకుండా నిత్యం వివాదాల్లో చిక్కుకోవటం ఒకింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీసీ విద్యార్థుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించటమే మానేశారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు.